వేలాది పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన విధానం అదేనా అని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రశ్నించారు. మహానుభావుల పేర్లు ప్రస్తావించే పవన్ వారు చెప్పిన విషయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను పవన్ లేవనెత్తారని, సిఎం జగన్ ఆ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఒక్కసారైనా పరిశీలించారా అని అడిగారు. ఏవైనా సమస్యలు ఉంటే పవన్ ప్రభుత్వం దృష్టికి తీసుకు రావొచ్చని అంతేగానీ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా పవన్ మాట్లాడారని ధర్మాన అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్నటి రణస్థలి సభలో తనపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ధర్మాన స్పందించారు.
60ఏళ్ళపాటు వెనుకబడిన ప్రాంతాల నోరు నొక్కి వారి నిధులను ఒకే ప్రాంతంలో ఖర్చు పెడితే, విభజన పేరుతో ఆ ప్రాంతాన్ని కట్టుబట్టలతో వదిలి పెట్టాల్సి వచ్చిందని, మరోసారి అదే పరిస్థితి పునరావృతం కాకూడదని, ఇదే విషయాన్ని శివరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పిందని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రంపై తన వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో పవన్ తెలుసుకోవాలన్నారు. అమరావతిలోనే అభివృద్ధి అంతా కేంద్రీకరించి మిగిలిన ప్రాంతాలను అన్యాయం చేస్తే విద్వేషాలు తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించి, దూరదృష్టితో సిఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారని చెప్పారు. కానీ చంద్రబాబు రాజాంకు వచ్చి అమరావతి సింగిల్ రాజధానికే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టంగా చెప్పినప్పుడు తాను ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు. మరో 50 ఏళ్ళు మా నోరు నొక్కి నిధులన్నీ అక్కడ ఖర్చు పెడతామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
సైనికుడి భూమిని తాను కబ్జా చేసినట్లు చంద్రబాబు, ఈనాడు చేసిన ఆరోపణలను పవన్ కళ్యాణ్ కూడా చేయడం సహేతుకం కాదని, అలా చేయడానికి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. సిఎం జగన్ ను విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదని, సమసమాజాన్ని స్థాపించే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని, విద్య అభివృద్ధికి సోపానం అని గుర్తించి పేదలకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని, వైద్యంపై కూడా సిఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం పవన్ కు ఇష్టం లేదని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు.