Sunday, November 24, 2024
HomeTrending Newsపవన్ మాటలకు అర్ధాలే వేరులే: అంబటి

పవన్ మాటలకు అర్ధాలే వేరులే: అంబటి

పవన్ చెబుతున్నగౌరవం అనే పదానికి అర్ధం ఏమిటని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. ఆయన చెబుతున్న గౌరవం అంటే బరువు, ప్యాకేజ్ అని దుయబట్టారు. అసలు పోటీ చేయడానికి జన సేన పార్టీలో అభ్యర్ధులు కూడా లేరని, అందుకే ఎన్నికలకు ముందు టిడిపి నేతలు ఆ పార్టీలో చేరతారని… వారికి పవన్ టిక్కెట్లు కేటాయిస్తారని రాంబాబు జోస్యం చెప్పారు.  ముమ్మాటికీ పవన్ చేసే రాజకీయం ప్యాకేజీ కోసమేనని మరోసారి ఆరోపించారు. సత్తెనపల్లిలో అంబటి మీడియాతో మాట్లాడారు.

తెలుగు రాజకీయాల్లో పవన్ ఓ కామెడీ పీస్ అని, ఆ కామెడీ చూసేందుకే ప్రజలు ఆయన సభలకు వస్తారని అన్నారు. జనసైనికులున్నారు అంటూ పవన్ హెచ్చరికలు చేస్తున్నారని, మా పార్టీకి లేరా కార్యకర్తలు, సైనికులు, మహిళలు అని అంబటి ప్రశ్నించారు. పవన్ మాటలకు అర్ధాలే వేరని, ఆయనకు ఆరాటం తప్ప పోరాటం లేదన్నారు. ప్రజలు గ్యారెంటీ ఇస్తే సింగిల్ గా పోటీ చేస్తానని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. అసలు గ్యారెంటీ కార్డుతో పోటీచేయడమేమిటని, చంద్రబాబు ఏమైనా గ్యారెంటీ ఇచ్చాడా అని రాంబాబు సూటిగా అడిగారు.

రాజకీయాల పట్ల పవన్ కు అవగాహన లేదని, చంద్రబాబుకు ఆపద వచ్చినప్పుడు రక్షించేందుకే జనసేన పెట్టారని అంబటి అన్నారు. ఆయన వెళుతున్న మార్గం సరికాదని, ఈ విషయాన్ని జనసేన అభిమానులు గమనించాలని హితవు పలికారు. పవన్ తో పాటు ఆయనతో ఎవరు కలిసినా వారుకూడా నష్టపోతారని హెచ్చరించారు. సిఎం జగన్ గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్ బ్రదర్స్ కు లేదన్నారు. చంద్రబాబుతో కలవడాన్ని, ప్యాకేజీ పొందడాన్ని ఒక వ్యూహంగా పవన్ చెప్పుకోవడం దారుణమన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్