హైదరాబాద్ నగరంలో తార్నాక పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఉస్మానియా యూనివర్సిటీ పోలిస్ స్టేషన్ పరిధిలోని రూపాలి అపార్ట్‌మెంట్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలతో నాలుగేళ్ల చిన్నారి సహా దంపతులు, ఓ మహిళ ఆత్మహత్యకు చేసుకున్నారు. నిన్నటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడం, గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో గది తలుపులు తెరిచి చూశారు.
కుటుంబ కలహాలు… నలుగురు ఆత్మహత్య
అప్పటికే దంపతులతో పాటు చిన్నారి, మహిళ మృతి చెందినట్లు గుర్తించారు. మృతులను ప్రతాప్ (34), అతని భార్య సింధూర (32), ఆద్య (4), తల్లి రజితగా గుర్తించారు. ప్రతాప్ చెన్నైలోని బీఎండబ్ల్యూ కార్ల షోరూంలో డిజైనర్ మేనేజర్‌గా, సింధూర హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురిని చంపిన తర్వాత ప్రతాప్ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చెన్నై వెళ్లే విషయంలో వాగ్వాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.