దావోస్ లో మొదలైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు ఆంధ్ర ప్రదేశ్ కు ఆహ్వానం అందలేదంటూ తెలుగుదేశం చేస్తోన్న ప్రచారాన్ని ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. ఈ సమావేశాలకు ఆహ్వానిస్తూ ఫోరం అధ్యక్షుడు అధికారికంగా రాసిన లేఖను ప్రభుత్వం బైటపెట్టింది.
దావోస్ కు ఏపీ నుంచి ఏ ఒక్కరూ ఎందుకు వెళ్లలేదని, పక్క రాష్ట్ర మంత్రులు అక్కడకు వెళ్లి పెట్టుబడులు తీసుకువస్తుంటే ఇక్కడ మాత్రం మందు, ఫిష్ మార్కెట్లు తీసుకు వస్తున్నారని టిడిపి నేత బొండా ఉమా విమర్శించారు. మన రాష్ట్ర ఐటి మంత్రి కోడె పందేలు ఆడించడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. “పెట్టుబడిదారులను ఆహ్వానించి, మన రాష్ట్రానికి ప్రఖ్యాత పరిశ్రమలను తీసుకొని వస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కానీ జగన్ రెడ్డి మొఖం చూసి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు కూడా ఆహ్వానం అందలేదు. ఇతడిని పిలిచినా దండగే అనుకొని ఉంటారు” అంటూ టిడిపి అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది.
దీనిపై వైసీపీ కూడా తీవ్రంగా స్పందించింది. 14 సంవత్సరాలు సిఎంగా ఉంది 9 సార్లు దావోస్ కు చంద్రబాబు వెళ్ళారని, గత ఐదేళ్ళలో 11,994 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే, జగన్ సిఎం అయ్యాక 2 సంవత్సరాలు కరోనా ఉందని, గత ఏడాది జగన్ దావోస్ వెళ్లి 1 .25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారని తెలియజేసింది. తమ మూడేళ్లలో పాలనలో సగటున ఏటా 15,693 కోట్ల పెట్టుబుడులు వచ్చాయన్నారు. 1.67 లక్షల కోట్ల పెట్టుబడులకు SIPB(State Investment Promotion Board) ఆమోదం తెలిపిందని వెల్లడించింది.