భారతీయ జనతా పార్టీ కేవలం భ్రమలు కల్పిస్తుందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఇవాళ ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. కుడి వైపు చూస్తే.. ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు.. ఎడమ వైపు చూసినా అదే సీన్.. ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు.. ఇలాంటి చరిత్రాత్మక నేలపై ఈ జనాన్ని చూస్తుంటే సంతోషంగా ఉందని, ఇంత మంది ముందు సందేశం ఇవ్వడానికి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభకు వచ్చిన జనమే దేశానికి సంకేతం అని అఖిలేశ్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణం .. ప్రజాసమస్యలకు పరిష్కారంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దేశంలోని అన్ని సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం ఢిల్లీలో కూర్చోని ఒక్కొక్క రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తోందని అఖిలేశ్ అన్నారు.
400 రోజుల తర్వాత కేంద్ర సర్కార్ ఉండదని, ఆ ప్రభుత్వానికి ఇంకా 399 రోజులు మాత్రమే ఉన్నాయన్నారు. కిసాన్ డిమాండ్లను బీజేపీ ప్రభుత్వం తీర్చడం లేదన్నారు. రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామన్నారు, కానీ బీజేపీ విఫలమైందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వెళ్లగొట్టేందుకు ఇక్కడ నుంచి ప్రయత్నాలు జరగాలన్నారు.
తెలంగాణలో బీజేపీని తరిమికొట్టండి, యూపీ నుంచి కూడా ఆ పార్టీని వెళ్లగొడుతామని అఖిలేశ్ అన్నారు. గంగా నదిని శుభ్రం చేస్తామన్నారు. కానీ ఆ ప్రయత్నంలో బీజేపీ సర్కార్ విఫలమైందన్నారు. తెలంగాణలో మిషన్ భగీరథ పథకం అద్భుతమని అన్నారు. తెలంగాణ ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపిన అఖిలేశ్.. ప్రగతిశీల నేతలు ఒక్కటి కావాలన్నారు.
యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని అఖిలేశ్ ప్రశంసించారు. విష్ణు అవతారమైన నర్సింహాస్వామి ఆలయాన్ని అద్భుతంగా పునర్ నిర్మించారని, కానీ ఆ స్థాయిలో ప్రచారం మీరు చేసుకోలేదన్నారు. కానీ కొందరు ఆలయం కట్టలేదు కానీ, దాని గురించి ఎక్కువ ప్రచారం చేస్తున్నారని ఆయన బీజేపీపై విమర్శలు చేశారు.
బీజేపీ కేవలం భ్రమలు కల్పిస్తుందని, చాలా జాగ్రత్తగా ఉండాలని అఖిలేశ్ అన్నారు. ఖమ్మం సభకు ఆహ్వానించినందుకు ఆయన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఇంకా 400 రోజులే మిగిలి ఉన్నాయని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. కేంద్రం రోజులు లెక్కబెట్టుకుంటోందని, ఇవాల్టితో ఇంకా 399 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు. రైతులను ఆదుకుంటామని మోదీ మాటతప్పారని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని మోసం చేశారని అన్నారు. దర్యాప్తు సంస్థలను చూపి ప్రతిపక్షాలను బీజేపీ భయపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. కేసుల పేరుతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.