బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యమని సీపీఐ నేత డీ రాజా అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళుర్పిస్తున్నానన్నారు. తెలంగాణలో సుపరిపాలన అందుతోందని, సీఎం కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభిస్తున్నానని తెలిపారు. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, నిరంతర కరెంటు, శుభ్రమైన తాగునీరు అందుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతుబంధు, దళితబంధు పథకాలు ఆదర్శనీయమన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ మంచి పథకాలు తేవాలని సూచించారు. భారతదేశం అతిపెద్ద సంక్షోభంలో ఉందని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు.
దేశంలో లౌకికతత్వం ప్రమాదంలో పడిందన్న ఆయన.. భారత్ హిందూ దేశంగా మారే ప్రమాదం కనబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అంశాలను కేంద్రం విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. మోదీ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. మోదీ పేదలు, రైతుల పక్షాన లేరని.. అదానీ, అంబానీ, టాటాబిర్లా జపం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని, కేరళ, తమిళనాడు, తెలంగాణలో గవర్నర్లు హద్దుమీరుతున్నారన్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఢిల్లీలో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలన్నారు. బీజేపీపై ఐక్య పోరాటానికి ఖమ్మం సభ నాంది కావాలని, బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యమని, బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేయలేదన్నారు.