Sunday, November 24, 2024
HomeTrending Newsవిచ్ఛిన్న కుట్రలను ఛేదించాలి - వెంకయ్యనాయుడు

విచ్ఛిన్న కుట్రలను ఛేదించాలి – వెంకయ్యనాయుడు

భారతమాత మహా హారతితో భాగ్యనగరం పులకించిపోయింది. వందేమాతరం నినాదాలతో నెక్లెస్ రోడ్డు మార్మోగిపొయింది. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో జరిగిన ‘భారతమాత మహా హారతి’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం సాయంత్రం కార్యక్రమం ప్రారంభం అయినప్పటినుంచి.. నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులతోపాటు వివిధ రాష్ట్రాలనుంచి వచ్చిన సాంస్కృతిక కళాకారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వివిధ సంస్కృతులను ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన జరిగింది. విద్యార్థులు, కార్యక్రమానికి హాజరైన పెద్దలు కూడా చప్పట్లతో ఈ ఉత్సాహంలో పాలుపంచుకున్నారు. భారతీయ సమాజంలో ఎప్పటికప్పుడు దేశభక్తిని జాగృతం చేసే లక్ష్యంతో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోసారి జరుగుతున్న ఈ ‘భారతమాత మహాహారతి’ కార్యక్రమంలో.. భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా మనమంతా ఒక్కటే అనే సంకల్పంతోనే భారతమాత మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. మనమంతా భారతమాత సంతానమేనని ఆయన పేర్కొన్నారు.

భారతీయ సమాజాన్ని వివిధ గ్రూపుల పేరుతో చీల్చే శక్తులు, వ్యక్తులను దూరం పెట్టాలని ఆయన సూచించారు. వసుధైవ కుటుంబం స్ఫూర్తితో ముందుకెళ్తున్న భారతదేశం, భారతజాతి ఎన్నడూ అశాంతి నెలకొల్పేలా ప్రవర్తించలేదని వెంకయ్యనాయుడు అన్నారు. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మన జాతి పునాదులు ఏర్పాటయ్యాయన్నారు.

శాంతి, అహింస మన రక్తంలో ఉన్నాయని అయితే మన మంచితనాన్ని అసమర్థతగా భావించే పరిస్థితులు వస్తే.. శత్రువులకు సరైన బుద్ధి చెప్పే విషయంలోనూ భారతదేశం వెనుకాడదన్నారు. బ్రిటిషర్లు మన సంస్కృతిని నాశనం చేసి.. వారి సంస్కృతిని, వారి విద్యావిధానాన్ని మనపై రుద్ది వెళ్లారన్న వెంకయ్యనాయుడు. ప్రతి భారతీయుడు మరీ ముఖ్యంగా విద్యార్థులు, యువత వైభవోపేతమైన భారత చరిత్ర, స్వరాజ్య వీరుల త్యాగాలు తెలుసుకోవాలన్నారు.
మనం కలిసికట్టుగా సమైక్యంగా సోదరభావంతో మెలిగినప్పుడే మనం నిజమైన భారతీయులం అవుతామని ఆయన సూచించారు.

జన్మనిచ్చిన తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదన్నారు వెంకయ్యనాయుడు. అమ్మభాషను కాపాడుకోవాలన్నారు. మన సంప్రదాయ కళలలను గౌరవించుకోవాలన్నారు. రాణిరుద్రమ, ఝాన్సీ లక్ష్మీబాయి, కొమురం భీమ్, అల్లూరి సీతారామారాజు వంటి మహనీయుల జీవిత చరిత్రలను చరిత్ర పుటల్లో ఎక్కించాలని ఆయన సూచించారు.

భారతమాత హారతి అంటే 130 కోట్ల మందికి హారతి అర్పించడమని, వారి జీవితాల్లో వెలుగు నింపడమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఏటేటా సరికొత్త ఉత్సాహంతో భారతమాత హారతి కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, భారతమాత ఫౌండేషన్ సభ్యులను ఆయన అభినందించారు.

ఆ తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, మన పూర్వీకులు బోధించిన నీతిని, విలువలను పాటించినపుడే మన సంస్కృతి తర్వాతి తరాలకు అందించేందుకు వీలుపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెసులుకోవడమే నిజమైన దేశభక్తి అని ఆయన పేర్కొన్నారు.

దేశభక్తి, దైవ భక్తి ఒక నాణేనికి రెండు వైపులని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ రూపాన్ని ఇక్కడ చూపించారన్నారని గురూజీ అన్నారు. ప్రపంచం మొత్తానికి భారతదేశం.. సరైన సంస్కృతిని, సద్బుద్ధిని, జ్ఞానాన్ని అందిస్తోందని.. ఇవాళ భారత్ చేరుకున్న స్థానం మనమంతా గర్వించదగినదని గురుదేవ్ అన్నారు.

మధ్యలో కొంతకాలం మన యువత బాలీవుడ్ మోజులో పడి పాశ్యాత్య సంస్కృతిని అలవర్చుకుంటున్నారనే ఆవేదన ఉండేదని, కానీ కొంతకాలంగా తన ఆవేదన తీరిపోవడానికి కారణం.. దేశ యువత పెద్దసంఖ్యలో భారతీయతవైపు ఆసక్తి కనబర్చడమేనని ఆయన అన్నారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల వేష, భాషలను, ఆహారపు అలవాట్లను గౌరవించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ మాతృభాషను గౌరవించుకోవాలని, తర్వాత జాతీయ భాషను, ఆ తర్వాత అంతర్జాతీయ భాషను నేర్చుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ తోపాటు నగరంలోని వివిధ రంగాల ప్రముఖులు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్