జీవో నెం.1 పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తాజా పిటిషన్లపై రేపు కూడా వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఈ విషయమై ఇరు పక్షాల తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు నేడు హైకోర్టులో తమ వాదనలు బెంచ్ ముందు వినిపించారు.
అంతకుముందు హైకోర్టు వెకేషన్ బెంచ్ వ్యవహరించిన తీరుపై ఏపీ ప్రధాన న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెకేషన్ బెంచ్ డీఫాక్టో చీఫ్ జస్టిస్‌లా వ్యవహరించిందని, ఈ కేసును స్వీకరించడం ద్వారా చెంచ్ పరిధి మించి వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. జీవో నంబర్ వన్ పై హైకోర్టు బెంచ్ గతంలో విచారణకు స్వీకరించి నేటి (జనవరి 23 )వరకూ దాన్ని సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించింది. అసలు ఈ కేసుపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు స్వీకరించిన విధానాన్ని కూడా చీఫ్ జస్టిస్ తప్పు బట్టారు.
ఈ సందర్భంగా ఆయన ఈ క్రింది వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది.
- ప్రతి కేసు ముఖ్యమైనదే అని భావించుకుంటూ వెళ్తే హైకోర్టు ఏమైపోవాలి?
- ఇలాంటివి జరిగితే ప్రతి వెకేషన్ జడ్జి చీఫ్ జస్టిస్ అయిపోయినట్లే
- పిటిషన్ మూలాల్లోకి వెళ్లి చూస్తే అంత ఎమర్జెన్సీ కూడా అనిపించలేదు
- ఈ కేసు గురించి, దాని మూలాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నా
- నాకేమీ తెలియదని అనుకోవద్దు, రిజిస్ట్రీ ఎప్పటికప్పుడు నివేదించింది
- హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నా అధికారాలను పూర్తిగా వినియోగిస్తా
- నా పిటిషన్ స్వీకరించాలంటూ వెకేషన్ కోర్టు ముందు ధర్నా జరిగిందా?
- అంత అర్జంటుగా వెకేషన్ బెంచ్‌లో లంచ్ మోషన్ ఎందుకు వేశారు?
- ఎలాంటి అత్యవసరం లేనప్పుడు లంచ్ మోషన్ వేయాల్సిన అవసరమేంటీ..? అంటూ చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
రేపు హైకోర్టు డివిజన్ బెంచ్ జీవో నంబర్ 1 పై కీలక తీర్పు వెలువరించే అవకాశం ఉంది. కాగా గతంలో వెకేషన్ బెంచ్ తీర్పు మేరకు నేటి వరకూ ఈ జీవో పై సస్పెన్షన్ అమల్లో ఉంది, రేపటి నుంచి జీవో అమల్లోనే ఉన్నట్లు భావించాలని న్యాయ నిపుణులు చెబుతున్నారు.