Sunday, September 22, 2024
HomeTrending Newsరైతాంగంపై పన్నులకు మోడీ కుట్ర - పల్లా రాజేశ్వర్ రెడ్డి

రైతాంగంపై పన్నులకు మోడీ కుట్ర – పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఏనాడు ఎవ్వరూ ఆలోచించని విధంగా రైతాంగంపై మోడీ ప్రభుత్వం పన్ను వేయాలనుకోవడం దుర్మార్గమని రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ ఆలోచనను మోడీ తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ లు కసిరెడ్డి నారాయణ రెడ్డి, యెగ్గే మల్లేశం ఈ రోజు శాసనసభలోని బీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో  ప్రెస్ మీట్  నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా పేదరికంలోనే ఉన్న రైతుల పై పన్నులు వేయాలని ఆలోచన రావడం దుర్మార్గమన్నారు. మోడీ యే స్వయంగా ఎన్నో సార్లు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అని చెప్పారని, 60 సంవత్సరాల పై బడి ఉన్న రైతులకు పెన్షన్ ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.. అయినా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.

వ్యవసాయానికి 30 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తామని బీజేపీ మేనిఫెస్టో లో పెట్టి మాట తప్పిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. మోడీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయకపోగా పెట్టుబడి వ్యయాన్ని రెట్టింపు చేసిందన్నారు. నాలుగు రోజుల క్రితం మోడీ ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేబ్ రాయ్ ఓ పత్రిక లో వ్యాసం రాశారని, రైతుల ఆదాయంపై పన్ను వేయాలని అందులో వివేక్ సూచించారు. రైతుల ఆదాయంపై పన్ను నిర్ణయం రాష్ట్రాల పరిధి లోనిదని వివేక్ దేబరాయ్ అంటున్నారని, వివేక్ ఉన్నది పీఎం ఆర్థిక సలహా మండలి చైర్మన్… రాష్ట్రాలకు ఉచిత సలహా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మోడీ తక్షణమే ఆర్థిక సలహా మండలి చైర్మన్ భాద్యత ల నుంచి వివేక్ ను తప్పించాలని డిమాండ్ చేశారు. మోడీ స్పందించకపోతే రైతుల ఆదాయం పై పన్ను ఆయన ప్రతిపాదన గానే భావించాల్సి ఉంటుందన్నారు. రైతాంగాన్ని చంపి వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ది దారుల సంఖ్య ను ఇప్పటికే తగ్గించారు. రైతుల ఆదాయం పై పన్నుకు కూడా కేంద్రం వెనకాడదని అర్థమవుతోందన్నారు.
రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరుపుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెగేసి చెప్పారు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నా మేము సంయమనం పాటిస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రోటోకాల్ ను మేము పాటిస్తున్నాం.. బీజేపీ ప్రోటోకాల్ ను పాటించడం కుదరదని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కూడా గవర్నర్ తన దగ్గరే పెట్టుకున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్