తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. గవర్నర్ తమిళ్ సై జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో సిఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. జండా ఆవిష్కరించిన తరువాత గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టడానికి అందరం కృషి చేయాలని కోరారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని పిలుపు ఇచ్చారు.
తెలంగాణ నేలపై జాతీయ జెండా ఎగురవేయడం గర్వంగా ఉందన్నారు. దేశ భక్తి తో కూడిన ఆరు దశాబ్దాల ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. హైదరాబాద్ తో పాటు రాష్టం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ఇతరులకు అభినందనలు అలాగే సవాళ్లకు అనుగుణంగా కొత్త విధానాలు అనుసరిస్తున్న రైతుల స్ఫూర్తికి నా సెల్యూట్ అని పేర్కొన్నారు.
కొందరికి తాను నచ్చకపోవచ్చు.. ఎవరికీ నచ్చకపోయినా తెలంగాణ ప్రజల అభివృద్ధికి నిత్యం కృషి చేస్తూనే ఉంటానని తెలిపారు. కొత్త భవనాలు నిర్మించడం, ఫామ్‌హౌజ్‌లు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదు అందరికీ ఫార్మ్ లు కావాలి. తెలంగాణలో ఆందోళన కర పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకు సగటున 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు వాటిని నివారించాలి. తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కును కాపాడుకుందామన్నారు. సగటు జీవి ఆకాంక్షలు నెరవేరాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదని, రాష్ట్ర విద్యా వ్యవస్థలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. నిజాయితీ, ప్రేమ, హార్డ్‌వర్క్ నా బలమని ఈ సందర్బంగా గవర్నర్ వ్యాఖ్యానించారు. తెలంగాణతో తనకున్న బంధం మూడేళ్లు కాదని, పుట్టుకతోనే తనకు ఈ రాష్ట్రంతో బంధం ఏర్పడిందని అన్నారు. నాకు తెలంగాణ వాళ్ళు అంటే ఇష్టం.. ఎంత కష్టం అయిన పని చేస్తాను అని తెలిపారు.