నటుడు తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందని నారాయణ హృదయాలయ ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆస్పత్రికు తీసుకు వచ్చేనాటికి ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలిపింది.
నిన్న కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో స్పృహ తప్పి పడిపోయారు. స్థానికంగా ఉన్న డాక్టర్లు ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. సమీపంలోని బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు కుప్పం చేరుకొని మెరుగైన చికిత్స అందించారు. అనంతరం అర్థరాత్రి ఆస్పత్రికి తరలించారు.
తమ వైద్యులు కుప్పంలో పరీక్షించే సమయానికి ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, బెలూన్ యాంజియోప్లాస్టీ జరిగినట్లు గుర్తించామని లేఖలో వెల్లడించారు. మయోకార్డియల్ ఇంఫ్రాక్షన్ వల్ల కార్డియాక్ షాక్ కు గురయ్యారని బులెటిన్ లో తెలిపారు. డాక్టర్ల బృందం తారకరత్నను పరిక్షిస్తోందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని, కొద్దిరోజులపాటు ఇదే తరహా వైద్యం అందించాల్సి ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో సందర్శకులను అనుమతించడం కుదరదని, అర్ధం చేసుకోవాలని ఆస్పత్రి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.