Sunday, November 24, 2024
HomeTrending Newsఫిబ్రవరిలో పోడు భూములకు పట్టాలు - మంత్రి సత్యవతి రాథోడ్

ఫిబ్రవరిలో పోడు భూములకు పట్టాలు – మంత్రి సత్యవతి రాథోడ్

పోడు భూములకు ఫిబ్రవరి మాసంలో పట్టాలివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందున, దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఇప్పటికే వందశాతం సర్వేను గ్రామ సభల ద్వారా పూర్తి చేశామన్నారు. పోడు భూములకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఫారెస్ట్ రైట్స్ కమిటీలు, జిల్లా స్థాయి కమిటీల ద్వారా పరిశీలించి లబ్దిదారులను గుర్తించే ప్రక్రియ గత సంవత్సరం నుండి కొనసాగుతుందన్నారు. పోడు భూములకు సంబంధించి పత్రాలు జారీ చేసే అంశంపై జిల్లా కలెక్టర్లతో బీఆర్కేఆర్ భవన్ నుండి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లతో కలసి మంత్రి సత్యవతి రాథోడ్ వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అర్హులైన ప్రతీ ఒక్కరికీ పోడు భూములకు పట్టాలివ్వడంతోపాటుగా అడవుల సంరక్షణకు ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత నిస్తుందని స్పష్టం చేశారు. ఏ ఏ జిల్లాల్లో పోడు భూములకు అధికంగా దరఖాస్తులు అందాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అర్హులందరికీ పట్టాలివ్వాలన్నది ముఖ్యమంత్రి అభిలాష అని దీనికి అనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు సత్యవతి రాథోడ్ సూచించారు. అటవీ శాఖ మంత్రి ఏ. ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో స్థానిక ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వామ్యులను చేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అటవీ శాఖ, రెవెన్యూ సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, అన్ని స్థాయిల్లో ఈ ప్రక్రియ పూర్తిచేసుకొని పట్ట పాస్ బుక్లను ప్రింట్ చేసి, ఫిబ్రవరి మొదటి వారానికల్లా సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పిసీసీఎఫ్ డోబ్రియాల్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్