విశాఖపట్నం అతి త్వరలో పాలనా రాజధాని కాబోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రాజధాని కాబోతున్న విశాఖకు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. తాను కూడా త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో మార్చి 2,3 తేదీల్లో జరగబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సన్నాహక రౌండ్ టేబుల్ సమావేశం ఢిల్లీలోని లీలా రెసిడెన్సీలో జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన జగన్ పాలనా రాజధానిపై తన అభిప్రాయం కుండబద్దలు కొట్టారు. విశాఖలో పారిశ్రామికవేత్తలకు కావాల్సిన అన్ని సదుపాయాలూ అందుబాటులో ఉన్నాయని, ప్లగ్ అండ్ ప్లే విధానంతో వెంటనే అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. త్వరలోనే అది రాజధాని కాబోతుందన్నారు.
సిఎం ప్రసంగంలో ఇతర ముఖ్యాంశాలు:
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మాది
వరుసగా మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ ఒన్‌గా నిలిచింది
పారిశ్రామిక వేత్తల నుంచి ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈర్యాంకులు ఇచ్చారు
ఇప్పటికే 6 పోర్టులు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి
అదనంగా 4 పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి
మూడు ఇండస్ట్రియల్ కారిడర్లు ఉన్నాయి
పరిశ్రమలకు అనుమతుల విషయంలో సింగిల్ డెస్క్ విధానం అమల్లో ఉంది
21 రోజుల్లో అనుమతులు ఇస్తున్నాం
వివిధ ఉత్పత్తులకు సంబంధించిన తయారీ రంగంలో క్లస్టర్లు ఉన్నాయి
విశాఖపట్నం త్వరలో రాజధాని కాబోతుంది
ఇక్కడే గ్లోబల్ సమ్మిట్ మార్చి 3,4 తేదీల్లో నిర్వహిస్తున్నాం