పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రారంభించారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన్ స్కీమ్‌ను విస్తరించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ స్కీమ్‌పై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. కోవిడ్19 మహమ్మారి వేళ ప్రజల ప్రాణ రక్షణ కోసం తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని ముర్ము అన్నారు. మహిళల సాధికారత కోసం కేంద్ర సర్కార్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని, బేటీ బచావో.. బేటీ పడావో సక్సెస్ అయినట్లు ఆమె తెలిపారు. దేశంలో పురుషుల సంఖ్య కన్నా ఇప్పుడు మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని, మహిళ ఆరోగ్య స్థితి కూడా మెరుగుపడినట్లు ఆమె చెప్పారు. రైతుల ఆదాయాన్ని వృద్ధి చేశామని, గ్రామాలను కూడా డెవలప్ చేస్తున్నట్లు తెలిపారు. గరీబీ హఠావో స్కీమ్‌తో దేశంలో పేదరికాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నామని ఆమె చెప్పారు.
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నుంచి ట్రిపుల్ తలాక్ రద్దు లాంటి కీలక అంశాల నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్థిరమైన, భయంలేని, నిర్ణయాత్మక ప్రభుత్వం అధికారంలో ఉందని, పెద్ద పెద్ద కలల్ని ఆ ప్రభుత్వం నెరవేరుస్తున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. పేదరికం లేని భారత్‌ను నిర్మించాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. భారతీయుల ఆత్మస్థైర్యం అత్యున్నత స్థాయిలో ఉందని, ప్రపంచ దేశాలు ఇప్పుడు మనల్ని భిన్న కోణంలో చూస్తున్నాయని, ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఇండియా పరిష్కారాలు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.
రాష్ట్రపతి భవన్ నుంచి ఉదయం 11 గంటలకు పార్లమెంటుకు చేరుకున్న ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు బాయ్ కాట్ చేయగా.. కాంగ్రెస్ ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. సోమవారం శ్రీనగర్ లో రాహుల్ గాంధీ జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఎంపీలు.. మంగళవారం కూడా అక్కడే ఉండిపోయారు. కాంగ్రెస్ తరఫున పార్టీ మాజీ చీఫ్, ఎంపీ సోనియా గాంధీ సభకు హాజరయ్యారు.