భారతీయ సినీపరిశ్రమలో టాలీవుడ్ పేరు వినబడేలా చేసిన దర్శకుల్లో కె విశ్వనాథ్ ఒకరు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకొని, అద్భుతమైన చిత్ర కావ్యాలను తెరకెక్కించి, కళాతపస్వి అనిపించుకున్నారు. దర్శకుడు విశ్వనాథ్ మృతి తెలుగు సినీరంగానికి తీరని లోటు.
కాశీనాథుని విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా తెనాలి దగ్గర పేద పులివర్రులో జన్మించారు. ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం, తల్లి సరస్వతమ్మ. బాల్యం నుంచీ చదువుల్లో చురుగ్గా ఉన్న విశ్వనాథ్, అప్పట్లోనే రామాయణ, భారత, భాగవతాలు చదివేశారు. ఏ పుస్తకం కనిపించినా, చదువుతూ పోయేవారు. గుంటూరు హిందూ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదివిన విశ్వనాథ్, అదే ఊరిలోని ఆంధ్రక్రైస్తవ కళాశాలలో బి.యస్సీ. పట్టా పుచ్చుకున్నారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం విజయా-వాహినీ సంస్థలో పనిచేసేవారు. దాంతో డిగ్రీ పూర్తి కాగానే విజయావాహినీ స్టూడియోస్ లో సౌండ్ రికార్డిస్ట్ గా చేరారు. విజయా సంస్థ నిర్మించిన ‘పాతాళభైరవి’కి అసిస్టెంట్ రికార్డిస్ట్ గా చేశారు విశ్వనాథ్.
విశ్వనాథ్ కు తొలి నుంచీ కళారాధన అధికం. సకల కళలకూ నెలవైన విశ్వనాథుని పేరు పెట్టుకున్న ఆయన మనసు చిత్రసీమవైపు మర లింది. సౌండ్ ఇంజనీర్ గా చేశాక, ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేట్ గా చేరారు. కొన్ని చిత్రాలకు కథారచనలో పాలు పంచుకున్నారు. అలా అలా అన్నపూర్ణ సంస్థలో రాణిస్తున్న రోజుల్లోనే ఆ సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదనరావును విశ్వనాథ్ పనితనం ఆకర్షించింది. ‘
ఆత్మగౌరవం’ చిత్రంతో కె.విశ్వనాథ్ ను దర్శకునిగా పరిచయం చేశారు దుక్కిపాటి. తొలి చిత్రంలోనే తనదైన బాణీ ప్రదర్శించారు విశ్వనాథ్. నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్ తో చిత్రాలు రూపొందించారు విశ్వనాథ్. అప్పటి వర్ధమాన కథానాయకులు కృష్ణ, శోభన్ బాబుతోనూ మురిపించే సినిమాలు అందించారు. తన చిత్రాలలో ఏదో వైవిధ్యం ప్రదర్శించాలని తొలి నుంచీ ఆయన తపించేవారు. అందుకు తగ్గట్టుగానే కథలను ఎంచుకొనేవారు. తెలుగునాట శోభన్ బాబు, చంద్రమోహన్, కమల్ హాసన్ వంటివారు స్టార్ డమ్ చూడటానికి ఆయన చిత్రాలు కారణమయ్యాయని చెప్పవచ్చు.
తెలుగువారిని కళలవైపు మళ్ళించిన దర్శకులు మరొకరు కానరారు. ‘శంకరాభరణం’ విడుదలైన రోజుల్లో తెలుగునాటనే కాదు, తమిళ, మళయాళ, కన్నడ సీమల్లోనూ పలువురు బాలలు గానంపై ధ్యానం పెట్టారు. ఆ చిత్రంతోనే కమర్షియల్ చట్రంలో చిక్కుకున్న తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గౌరవం తీసుకు వచ్చారు విశ్వనాథ్. ‘శంకరాభరణం’ తరువాత విశ్వనాథ్ నిర్దేశకత్వంలో వెలుగు చూసిన “శుభోదయం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వర్ణకమలం” ఇలా ఎన్నెన్నో కళాఖండాలు మన మదిలో తిష్ట వేసుకున్నాయి.