భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి మద్యపాన నిషేధానికి వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలోని నివారీ జిల్లాలో గల ఓ మద్యం దుకాణం ముందు ఆవులను కట్టేసి.. అక్కడికి వచ్చి పోయేవారికి ‘మద్యం కాదు.. ఆవు పాలు తాగండి’ అంటూ ప్రచారం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడితే వచ్చే సొమ్ము కోసం ఆశపడొద్దని, మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమా భారతి అభ్యర్థించారు.
‘మద్యపానంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడితే వచ్చే సొమ్ము కోసం ఆశపడొద్దని, మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నా. రాష్ట్రంలోని పేద ప్రజలకు మద్యపానం ఓ సమస్యగా మారింది. దీనికి నేను కూడా కొంతవరకు కారణమే. అందుకే మధ్యప్రదేశ్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం కోసం కృషి చేస్తాను’ అని ఈ సందర్భంగా ఉమా భారతి తెలిపారు.