Sunday, November 24, 2024
HomeTrending Newsదేశ దుస్థితి మార్చేందుకే బీఆర్‌ఎస్‌ గా అవతరించాం: కేసీఆర్‌

దేశ దుస్థితి మార్చేందుకే బీఆర్‌ఎస్‌ గా అవతరించాం: కేసీఆర్‌

మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా కేంద్రంలో శ్రీ గురు గోబింద్ సింగ్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న బి ఆర్ ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం పలికిన బి ఆర్ ఎస్ నాందేడ్ , తెలంగాణ నాయకులు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాందేడ్ చారిత్రక గురుద్వారాను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు సిక్కు మ‌త‌గ గురువులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం గురుద్వారాలో కేసీఆర్ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ప్రార్థ‌న‌ల అనంత‌రం కేసీఆర్‌ను సిక్కు మ‌త గురువులు ఆశీర్వ‌దించారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ క‌విత‌తో పాటు ప‌లువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ నాందేడ్‌ స‌భా వేదికపై డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్, మ‌ర‌ఠా యోధుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుష్పాంజ‌లి ఘ‌టించి, నివాళుల‌ర్పించారు. మహిళల విద్యాభ్యున్నతికి కృషి చేసిన అన్న బావుసాట్, అహల్యబాయి హోవల్కర్, మరఠ్వాడ పోరాట యోధులు చత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, లోకమాన్య తిలక్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్ర‌హాల‌కు కేసీఆర్ నివాళుల‌ర్పించారు.

బీఆర్‌ఎస్‌కు దేశవ్యాప్తంగా మద్ధతు లభిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. మరఠ్వాడా గడ్డ ఎంతో మంది మహానీయులకు జన్మనిచ్చిందన్నారు. 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా దేశంలో సాగు, తాగునీరు, కరెంట్ కోసం కష్టాలేనా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుత నేతలు మాటలకే పరిమితమవుతున్నారని, దేశంలో నాయకత్వ మార్పు రావాలని పిలుపునిచ్చారు.

నాందేడ్ వేదికగా జరిగిన బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో బిఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రసంగం – ముఖ్యాంశాలు

• నేను మీకు చెప్పబోయే విషయాలు ఏవో రాకేట్ సైన్స్ కాదు. చాలా సాధరణ విషయాలు.
• దేశంలో ఈ వనరుల లభ్యత లేదా ? ప్రజలకు ఈ సౌకర్యాలను సమకూర్చలేమా ? దీని వెనుకున్న మతలబు ఏంటి ? ఈ విషయాన్ని మనం అర్థ చేసుకోవాలి. అర్థమయ్యాక కూడా అర్థం కానట్టు ఉండకూడదు. ఓసారి అర్థమయ్యాక అంతా ఏకం కావాలి.
• మహారాష్ట్ర రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏమిటి ? దయచేసి ఆలోచించండి.
రైతులు ఆత్మహత్యకు ఎలాంటి పరిస్థితుల్లో పాల్పడతారు ? అన్ని దారులు మూసుకుపోయి, అత్యంత బలహీన పరిస్థితుల్లో, ఆక్రోషంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి ఆత్మలు ఎంత ఘోషిస్తున్నాయో ? ఎంత వేదనను అనుభవిస్తున్నాయో ?

• అందుకే బిఆర్ఎస్ పార్టీ దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏ పార్టీ ఇవ్వని అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ప్రజల ముందుకు వచ్చింది
• ఈ దేశంలో రైతుల సంఖ్య జనాభాలో 42 శాతం కంటే అధికంగా ఉంది. వ్యవసాయ కార్మికులను కూడా కలిపితే ఇది 50 శాతం కంటే ఎక్కువగా ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దీని కన్నా బలం అవసరం లేదు.
• ఇప్పటికే 75 సంవత్సరాల సుదీర్ఘ కాలం వేచి చూశాం. ఇప్పుడు రైతుల సమయం వచ్చింది.
• నేటి వరకు మనం హలాన్ని (నాగలిని) పట్టి, కలాన్ని వేరే వాళ్లకు అప్పగించాం.
• రైతులు కేవలం నాగలిని పట్టడమే కాదు కలాన్ని పట్టి, చట్టం చేసే అవకాశాలను కూడా పొందాలి.
• ఎప్పుడు ఎన్నికలొచ్చినా పార్టీలు గెలుస్తాయి. రాజకీయ నాయకులు గెలుస్తారు. కానీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. రైతులు గెలవాలి. మన సమస్యలకు అదే సమాధానం.
• భౌగోళింకంగా అమెరికా మన కంటే రెండున్నర రెట్లు పెద్దది. కానీ వారి వద్ద వ్యవసాయ యోగ్యమైన భూమి 29 శాతం మాత్రమే ఉంది
• చైనా మనకంటే ఒకటిన్నర రెట్లు పెద్దది. కానీ వ్యవసాయ యోగ్యభూమి కేవలం 16 శాతం మాత్రమే ఉంది.
• మొత్తం ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే 50 శాతం వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది.
• భారతదేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణం 83 కోట్ల ఎకరాలు. దీంట్లో 41 కోట్ల ఎకరాలు భూమి వ్యవసాయ యోగ్యంగా ఉంది. ఇవి నేను చెప్తున్న గణాంకాలు కాదు స్వయంగా కేంద్ర ప్రభుత్వం తేల్చిన గణాంకాలు.
• ఈ దేశంలో 1 లక్ష 40 వేల టిఎంసిల వర్షపాతం సంభవిస్తుంది. దీంట్లో సగం నీరు భాష్పీకరణ ప్రక్రియ ద్వారా ఆవిరిగా మారతుంది. మిగిలిన 70-75 వేల టిఎంసిల స్వచ్ఛమైన నీరు నదుల్లో ప్రవహిస్తుంది. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కేవలం 20 నుండి 21 వేల టిఎంసిల నీటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. మిగిలిన 50 వేల టిఎంసిల నీరు వృధాగా సముద్రాల్లో కలుస్తుంది. ఇవి కేంద్రప్రభుత్వం వెలువరించి గణాంకాలే.
• 50 వేల టింఎసిల నీరు సముద్రల పాలవుతుంటే నాయకులు తమాషా చూస్తున్నారు. ఎన్నో చోట్ల తాగునీటికి కటకట.
• మహారాష్ట్ర పరిస్థితి చూస్తుంటే నాకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటుంది. ఇక్కడి నుంచే గోదావరి, కృష్ణా, ప్రవర, పూర్ణ, పెన్ గంగా, వార్ధా, ఘట ప్రభా, మంజీర, భీమా, ప్రాణహిత, ఇంద్రావతి వంటి ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి. అపార జలవనరులున్న మహారాష్ట్రలో నీటికి కటకట ఎందుకు ? దీనికి కారకులు ఎవరు ? దయచేసి ఆలోచించండి. మీరు మీ మీ ఇండ్లకు వెళ్ళిన తర్వాత ఈ విషయం పై ఆలోచించండి.
• ప్రధానమంత్రి మోడీ తెచ్చిన మేకిన్ ఇండియా … జోకిన్ ఇండియాగా మారింది. మేకిన్ ఇండియా ఎక్కడికి పోయింది ?
• దేశంలోని ప్రతీ చిన్న చిన్న పట్టణాల్లో చైనా బజార్లు వెలుస్తాయి. పతంగుల మాంజా, దీపావళి పటాకులు, హోళీ రంగులు, దీపావళి దీపాలు, మనం పూజించే వినాయకుని ప్రతిమలు, మన జాతీయ జెండా చైనా నుంచి వస్తాయి.
• మేకిన్ ఇండియా అమలైతే చైనా బజార్లున్న చోట భారత్ బజార్ లు పేట్టేవారు కదా…? నాందేడ్, పర్బనీ, అకోలా, …. తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ఎక్కడికి పోయినా చైనా బజార్లు కనిపిస్తాయి.
• నేను మీ అన్నను, మీ కొడుకును. బాధాతప్త హృదయంతో ఈ విషయాలు చెప్తున్నాను. ఈ విషయాల పై బాగా ఆలోచించాలి.
• ఈ దేశ ప్రజలకు తాగేందుకు నీరు ఉండదు. సాగునీరు లభించదు. మరోపక్క విద్యుత్ సమస్యలు. కానీ నాయకుల ప్రసంగాలు మాత్రం ఘనం. మన్ కీ బాత్, ఈ బాత్, ఓ బాత్ అంటూ అంటూ ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మభ్య పెడతారు ?

• కిసాన్ సర్కార్ వస్తేనే దేశం పురోగమిస్తుంది.
• ఎనిమిదేండ్ల క్రితం తెలంగాణ పరిస్థితి కూడా మీకంటే దారుణంగా ఉండేది. రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. వ్యవసాయరంగంలో సంక్షోభం ఉండేది. కానీ నేడు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్నది.
• తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రోటీ – బేటి సంబంధం ఉంది. పరస్పరం రాకపోకలు సాగుతుంటాయి.
• తెలంగాణ రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాం.
• ఇది తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో, ఇతర రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎందుకు సాధ్యం కాదు? కిసాన్ సర్కార్ ఏర్పడితే అది సాధ్యమవుతుంది.
• దేశంలో 301 బిలియన్ టన్నుల అపార బొగ్గు వనరులున్నాయి. రోజుకు 24 గంటలు విద్యుత్ అందించినా 125 సంవత్సరాల వరకు ఈ బొగ్గు వనరులు సరిపోతాయి
• మహారాష్ట్రలోనే అపార బొగ్గు వనరులున్నాయి. కానీ కరెంటు ఉండదు. ఏదో లోపం ఉంది.
• మనం ఏకమయ్యే వరకు ఈ రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి.
• తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లు. మహారాష్ట్ర బడ్జెట్ 5 లక్షల కోట్లు. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు మహారాష్ట్ర అమలు చేయలేదా ? మహారాష్ట్ర సర్కార్ వద్ద ధనం ఉన్నప్పటికీ, వారికి ప్రజా శ్రేయస్సు పై మనసు లేదు.
• భారీ సంఖ్యలో వచ్చి ఐకమత్యాన్ని చాటినందుకు, నా పై ప్రేమను చాటినందుకు ధన్యున్ని. ఈ ప్రేమను గుండెల్లో పెట్టుకుంటాను.
• కేవలం 8 నుండి 10 రోజుల్లో ప్రతీ గ్రామానికి బిఆర్ఎస్ వాహనం చేరుకుంటుంది. అన్ని కమిటీలు ఏర్పడతాయి.
• మహారాష్ట్రలోని అన్ని అసెంబ్లీ నియోజవర్గాలకు ఈ వాహనాలు చేరుకుంటాయి.
• ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలమైన శివ్ నేరి వేదికగా ప్రతిన బూని, మహారాష్ట్ర వ్యాప్తంగా రైతు కమిటీలు ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది.
• పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ, ఉత్తర మహారాష్ట్ర ఇలా మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాల్లో పర్యటనలు చేపట్టి బిఆర్ఎస్ ను బలోపేతం చేసే దిశగా నా శాయశక్తులా కృషి చేస్తాను.

RELATED ARTICLES

Most Popular

న్యూస్