పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని కోహిస్థాన్ జిల్లా మీదుగా వెళ్ళే కారకోరం హైవేపై ఎదురెదురుగా వస్తున్న బస్సు.. కారు ఢీకొన్నాయి. అనంతరం రెండు వాహనాలు లోతైన లోయలో పడిపోయాయి. దీంతో 30 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. మృతదేహాలను, క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని షిటియాల్ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న కారును.. గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి రావల్పిండికి వెళ్తున్న బస్సు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి పాక్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతాపం తెలిపారు.
పాకిస్థాన్ లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. జనవరి 29న బలూచిస్థాన్‌లో జరిగిన ప్రమాదంలో 41 మంది మరణించారు. ప్రభుత్వం రోడ్డు భద్రత చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించటం… అధికారుల అవినీతితో సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి.