తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య గంటగంటకు అధికమవుతున్నది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 15 వేలు దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. సహాయక సిబ్బంది రాత్రి పగలు అని తేడాలేకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దీంతో శిథిలాల కింది నుంచి పెద్దసంఖ్య మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని. ఇరుదేశాల్లో భూకంప మృతులు 20 వేలకుపైగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత్ నుంచి టర్కీకి వెళ్లిన మూడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతమైన నూర్దగీలో సహాయక చర్యలో చురుకుగా పాల్గొంటున్నాయి. ఆర్మీ మెడికల్ బృందాలు క్షతగాత్రులకు వైద్యసాయం అందిస్తున్నాయి. తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ భూకంపం ప్రభావిత పజార్కిక్ పట్టణంతో పాటు హతాయ్ ప్రావిన్స్‌లో పర్యటించారు. మొదటి రోజు సహాయక చర్యలకు ఆటంకాలు కలిగాయని, ప్రస్తుతం పరిస్థితి మెరుగైందని తెలిపారు. తుర్కియేలో 60 వేల సిబ్బంది సహాయక చర్యల్లో ఉన్నారు.
దాదాపు 2.3 కోట్ల మందిపై భూకంపం ప్రభావం చూపిందని, ఇది తీవ్రమైన సంక్షోభమని డబ్ల్యూహెచ్‌వోకు చెందిన అధికారి ఒకరు పేర్కొన్నారు. భూకంపం వల్ల సర్వస్వం కోల్పోయిన బాధితుల్లో కొంత మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకొంటున్నారు. మరికొంతమంది ఆరుబయటే నిద్రిస్తున్నారు.
Also Read : టుర్కి సహాయక చర్యల్లో NDRF