విశాఖ రాజధాని అని చెబుతున్న జగన్, అక్కడ ఇప్పటివరకూ ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అభివృద్ధి చేయకపోగా ఎన్నో సంస్థలను అక్కడినుంచి తరిమేశారని, వేలాది ఎకరాల భూములు కబ్జా చేసి కోట్ల రూపాయలు లూటీ చేశారని ధ్వజమెత్తారు. అధికార మదంతో, గర్వంతో ముందుకు వెళ్తున్నారని, ప్రజలు దీనిపై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల పట్ల చిత్తశుద్ది, గౌరవం రెండూ లేని నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ప్రజా కోర్టులో జగన్ ను దోషిగా నిలబెట్టే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని ప్రకటించారు. డబ్బు, మ్యానిపులేషన్ తో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, అసలు రాజకీయాల్లో కొనసాగడానికి వైసీపీ, జగన్ కు అర్హత లేదని బాబు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బాబు మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో జగన్ పట్ల వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతోందని, అందుకే ముందస్తుకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ కు ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని గుర్తు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం ప్రకారమే అమరావతి రాజధాని ఏర్పాటైందని, ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టంగా పేర్కొందని బాబు వెల్లడించారు. వైసీపీ పార్టీ ఎంపి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజ్య సభలో కూడా కేంద్ర మంత్రి ఈ విషయమై స్పష్టమైన సమాధానం ఇచ్చారని, మూడు రాజధానుల నిర్ణయం తీసుకునే ముందు తమను సంప్రదించలేదని వారు చెప్పిన విషయాన్ని బాబు ప్రసావించారు. ఉపాధి కల్పనా, సంపద సృష్టి, పేదరిక నిర్మూనల ప్రాతిపదికలుగా ఏర్పాటైన రాజధాని అమరావతి అని చంద్రబాబు అభివర్ణించారు.
అమరావతిపై జగన్ ఎన్నోసార్లు ఊసరవెల్లి కంటే బాగా రంగులు మార్చారని దుయ్యబట్టారు. నాడు ఓట్ల కోసం అమరావతిని సమర్ధించి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఇష్టానుసారం మాట్లాడారని అన్నారు. గతంలో తాము ప్రారంభించిన ఎన్నో ప్రాజెక్టులను మధ్యలోనే ఆపేశారని, ఎన్నో కుట్రలకు తెరలేపారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసిన ఈ పనుల వల్ల రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందని, రాష్ట్రానికి రెండుకళ్ళుగా ఉన్న అమరావతి, పోలవరం రెంటినీ నిర్లక్ష్యం చేశారన్నారు. బాధ్యతగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఫైర్ అయ్యారు.
లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించారని, తమ హయంలో వైఎస్, జగన్ లు యాత్రలు చేసుకున్నారని తాము ఎలాంటి ఇబ్బందులూ కలిగించలేదని, కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ పోలీసులతో ఇబ్బందులు కలిగిస్తున్నారని, దీనికి కారణమైన పోలీసులును వదిపిలేట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Also Read : 3 Capitals: సుప్రీం స్టే మొట్టికాయ లాంటిది: సజ్జల