మహిళల టి 20 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ లో ఆథిత్య సౌతాఫ్రికాకు శ్రీలంక షాక్ ఇచ్చింది. లంక మహిళలు ఇచ్చిన 130 రన్స్ లక్ష్యాన్ని చేరుకోలేక 126 మాత్రమే ప్రోటీస్ మహిళలు చేయగలిగారు. కేప్ టౌన్ న్యూ లాండ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 28 పరుగులకే ఓపెనర్ మాధవి వికెట్ ను లంక కోల్పోయింది. అయితే కెప్టెన్ ఆటపట్టు-విష్మి గుణరత్నేలు రెండో వికెట్ కు 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆదుకున్నారు. ఆటపట్టు 50 బంతుల్లో 12 ఫోర్లతో 68; విష్మి 34 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.
సౌతాఫ్రికా 28వద్ద తొలి వికెట్ (టాజ్మిన్ బ్రిట్స్-12) కోల్పోయింది. ఆ తరువాత వరుస వికెట్లు సమర్పించుకుంది. కెప్టెన్ సూనే లూస్ ఒక్కటే 28 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచింది. చివరి రెండు ఓవర్లలో 20 పరుగులు కావాల్సిన సమయంలో 19వ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి ఏడు పరుగులే సాధించింది. చివరి ఓవర్లో కూడా ఒక వికెట్ కొల్పోయి 9 రన్స్ సాధించి మూడు పరుగులతో ఓటమి పాలైంది.
లంక బౌలర్లలో ఇనోక రణవీర మూడు; సుగంధిక కుమారి, రణసింఘే చెరో రెండు వికెట్లు సాధించారు.
లంక కెప్టెన్ చమరి ఆటపట్టుకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.