వచ్చే ఎన్నికల్లో సిఎం జగన్ ఓటమి ఖాయమని, ఆయన ఇంటికి పోయే సమయం దగ్గర పడిందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. యువ గళం పాదయాత్రలో భాగంగా చితూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఎస్ ఆర్ పురం, పుల్లూరు క్రాస్ రోడ్డులో లోకేష్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సభకు అనుమతి లేదంటూ లోకేష్ మైక్ ను పోలీసులు లాక్కోవడంతో మైక్ లేకుండానే ఆయన స్టూల్ పై నిలబడి మాట్లాడారు.
తాను టెర్రరిస్టు కాదని ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని లోకేష్ ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నియోజకవర్గం గంగాధర నెల్లూరులో అభివృద్ధి నిల్లు…అవినీతి ఫుల్లు అంటూ వ్యాఖ్యానించారు. తనను అడ్డుకోవడానికి వెయ్యి మంది పోలీసులు, 6 గురు డీఎస్పీలను సిఎం జగన్ నియమించారని, ఆఖరికి మహిళలకు రక్షణ కల్పించాల్సిన దిశ డిఎస్పీ కూడా తన వెంటే తిరుగుతున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత తమను అడ్డుకున్న పోలీసు అధికారులు అందరిపైనా సమీక్ష చేస్తానని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఇప్పుడు అతిగా ప్రవర్తిస్తున్న అందరి పేర్లూ రాసుకుంటున్నామని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించి వారి తోలు తీస్తామంటూ ఘాటుగా ఫైర్ అయ్యారు.
నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రిలో పెద్దా రెడ్డి భారీ ర్యాలీలు తీశారని, మైక్ లో ప్రసంగాలు చేశారని, వారికి వర్తించని జీవో 1 తనకు ఎలా వర్తిస్తుందని లోకేష్ నిలదీశారు. మైక్ లాక్కున్నంత మాత్రాన ఈ లోకేష్ ఆగే ప్రసక్తే లేదని, తనకు తాత ఎన్టీఆర్ గొంతు వచ్చిందని, తుది వరకూ పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
Also Read : స్టూల్ పై నిల్చొని లోకేష్ నిరసన