Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్కోవిడ్‌ నివారణ, కరోనా వాక్సిన్‌పై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

కోవిడ్‌ నివారణ, కరోనా వాక్సిన్‌పై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

కోవిడ్‌ నివారణ, కరోనా వాక్సినేషన్‌పై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష:

104 కాల్‌ సెంటర్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలి కోవిడ్‌ సోకిన వారికి ఆ సెంటర్‌ సహాయ సహకారాలు అందించాలికోవిడ్‌ లక్షణాలు ఉన్న వారు ఎక్కడికి పోవాలో సూచించాలి ఫోన్‌ చేస్తే 3 గంటల్లోగా బెడ్‌ కేటాయించాలి ఆస్పత్రుల్లో అవసరమైన దానికన్నా ఎక్కువ ఆక్సీజన్‌ ఉంచాలి
రెమ్‌డెస్‌విర్‌ ఇంజెక్షన్లు కూడా అందుబాటులో ఉంచాలి హోం ఐసొలేషన్‌లో ఉన్న వారిని కూడా ఫాలోఅప్‌ చేయాలి కోవిడ్‌ వాక్సిన్ల కోసం మరోసారి కేంద్రానికి లేఖ రాయండి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశంనిన్న ఒకే రోజు 6.28 లక్షల వాక్సిన్లు ఇచ్చారు రికార్డు స్థాయిలో వాక్సినేషన్‌. అందుకు అందరికీ అభినందనలు
ఇదే స్ఫూర్తితో ఇంకా ముందుకు వెళ్లాలి రోజుకు 6 లక్షల వాక్సిన్లు ఇచ్చే లక్ష్యంతో పని చేయాలి ఆ సామర్థ్యం మన రాష్ట్రానికి ఉందని చూపాలి కోవిడ్, కరోనా వాక్సిన్‌పై సమీక్షలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌

అమరావతి:

కోవిడ్‌ నివారణ, కరోనా వాక్సిన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.

సమీక్ష సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..:

ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను:
‘నిన్న అత్యధికంగా 6.28 లక్షల వాక్సిన్లు ఇచ్చాం. ఇది ఒక రికార్డు. ఇందుకు ప్రతి ఒక్కరికి అభినందిస్తున్నాను. మీరంతా ఎంతో చొరవ చూపి పని చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, పీహెచ్‌సీల సిబ్బంది కూడా అందరూ సమష్టిగా పని చేయడం వల్లనే ఇది సా«ధ్యమైంది. రికార్డు స్థాయిలో వాక్సిన్‌ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనం అనుకున్న లక్ష్యం సాధించాము. రోజుకు 6 లక్షల వాక్సిన్లు ఇవ్వాలన్నది మన లక్ష్యం. దాన్ని సాధించాము. ఇక ముందు కూడా అలాగే చేయాలి. ప్రస్తుతం వాక్సిన్లు లేవు, కాబట్టి వాటి కోసం లేఖ రాయండి. అవసరం అనుకుంటే నేను కూడా లేఖ రాస్తాను’.

104 కాల్‌ సెంటర్‌కు మరింత ప్రాచుర్యం:
‘ఇవాళి నుంచి 104 కాల్‌ సెంటర్‌పై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాలి. ఎవరికైనా చికిత్స, బెడ్‌ కావాలంటే ఆ కాల్‌ సెంటర్‌ ద్వారా సేవలందించాలి. హోం ఐసొలేషన్, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ లేదా ఆస్పత్రిలో చేర్చడానికి వైద్యుల సూచనల మేరకు సేవలందించాలి. అంబులెన్సు సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సహాయంతో రోగికి వేగంగా వైద్య సేవలందించాలి. హోం ఐసొలేషన్‌లో కూడా వారిని ఫాలో అప్‌ చేయాలి. రోగి ఫోన్‌ చేసిన 3 గంటల్లోగా ఆస్పత్రిలో బెడ్‌ సమకూర్చాలి’.
‘గ్రీవెన్సుల కోసం 1902 నెంబరు కేటాయించండి. ఇక 104 నెంబరు కోవిడ్‌ సేవల కోసం. ఈ రెండింటినీ విస్తృతంగా ప్రచారం చేయండి. కోవిడ్‌కు సంబంధించిన ఏ సందేహం ఉన్నా 104కు ఫోన్‌ చేయాలని బాగా ప్రచారం చేయండి. దీన్ని కూడా ఇవాళ్టి నుంచి ప్రచారంలో చేర్చండి. అందుకు అవసరమైన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను బస్టాండ్‌ వంటి పబ్లిక్‌ ప్లేసెస్‌లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయండి’.
‘కోవిడ్‌ పరీక్ష మొదలు.. వైద్యం, ఆస్పత్రులలో మెడిసిన్, శానిటేషన్, క్వాలిటీ ఆఫ్‌ ఫుడ్‌ వరకు.. ఏ మాత్రం రాజీ పడొద్దు. ఎక్కడా రోగులు ఇబ్బంది పడకుండా చూడాలి’.

ఛార్జీలపై దృష్టి పెట్టండి:
‘ఒకవేళ రోగి ప్రైవేటు ఆస్పత్రిలో చేరాలనుకుంటే, ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా, వాటిని కూడా స్పష్టంగా నిర్దేశించండి. రోగులకు ఎక్కడా బెడ్ల కొరత ఉండకూడదు. అందువల్ల ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ఆస్పత్రులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్ల వివరాలు కూడా అధికారుల దగ్గర ఉండాలి’.
‘ఆస్పత్రులలో చికిత్స ఫీజులు, ఛార్జీలకు సంబంధించిన వివరాలను రోగులకు అర్ధమయ్యేలా ప్రదర్శించాలి. అలాగే బోర్డులపై ప్రదర్శించిన దాని కంటే ఎక్కువ వసూలు చేస్తే, ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా ప్రజలకు (రోగులకు) తెలిసేలా అన్ని వివరాలు ప్రదర్శించాలి. ఎక్కడా రోగి దోపిడికి గురి కాకుండా ఉండేలా.. అవసరమైన ఔషథాలు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ల రేట్లు కూడా స్పష్టంగా ప్రదర్శించాలి. ఎక్కడైనా అధిక ఫీజులు, ఛార్జీలు వసూలు చేస్తే, కఠిన చర్యలు తీసుకోవాలి’.

ఆ మూడింటిపై ప్రత్యేక శ్రద్ధ:
‘ఆస్పత్రి కేర్, శానిటేషన్, నాణ్యమైన ఆహారం.. ఈ మూడు ప్రమాణాలు కోవిడ్‌ ఆస్పత్రులతో సహా, అన్ని ఆస్పత్రులలో ఉండేలా చూడాలి. క్వాలిటీ ఆఫ్‌ మెడికేషన్‌తో పాటు, సమయానికి మందులు అందించడం అన్నది కూడా చాలా ముఖ్యం. అన్ని ఆస్పత్రులలో ఇవన్నీ పర్‌ఫెక్ట్‌గా జరగాలి. అందుకోసం ఆస్పత్రులలో వాటిని పరిశీలించడానికి గతంలో మాదిరిగా కొందరు అధికారులకు బాధ్యతలు అప్పగించాలి. జిల్లాలలో కూడా ఆ ఏర్పాటు జరగాలి’.

టెస్టింగ్‌ ముఖ్యం:
‘టెస్టింగ్‌ చాలా ముఖ్యం. కోవిడ్‌ పేషెంట్‌ ప్రైమరీ కాంటాక్టులందరికీ పరీక్షలు చేయాలి. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో కూడా పరీక్షలు చేయాలి. పరీక్ష చేయించాలనుకున్న ఎవరైనా వెళ్లి, దాన్ని చేసుకునే విధంగా ప్రతి పీహెచ్‌సీలో తగిన ఏర్పాటు చేయాలి. ఇంకా 104కు ఎవరైనా ఫోన్‌ చేసి, తాము పరీక్ష చేయించుకోవాలని అనుకుంటున్నామని చెబితే, వారు ఎక్కడికి పోవాలన్నది గైడ్‌ చేయాలి. అందువల్ల పీహెచ్‌సీ, సబ్‌ సెంటర్‌ లేదా విలేజ్‌ క్లినిక్‌.. ఎక్కడైనా సరే పరీక్ష (అది కావాలని కోరుకునే వారికి.. తమకు కోవిడ్‌ వచ్చిందని భావించే వారికి) చేయించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలి’.

వాక్సినేషన్‌:
‘మన ఫోకస్‌ ఏరియా వాక్సినేషన్‌. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ ముగించాలి. ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికా బద్దంగా చేయాలి. రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ వేయాలి. వాక్సిన్‌ వేయడం మనకు చాలా ముఖ్యం. హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లందరికీ తప్పనిసరిగా వాక్సిన్‌ వేయాలి. ఒక్కరు కూడా మిగలొద్దు. మనం పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా, కచ్చితంగా ఇంకా కొన్ని రోజులు రోజుకు 6 లక్షల వాక్సిన్లు వేయాలి’.

హోం క్వారంటైన్‌:
‘హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు కచ్చితంగా ఇళ్లలోనే ఉండేలా, రెగ్యులర్‌గా మానిటర్‌ చేయాలి. అందుకు తగిన ప్రొటోకాల్‌ రూపొందించుకోండి. తరుచూ సందర్శించడం వంటివి చేయాలి. అదే విధంగా వారికి ఏడు రకాల ట్యాబ్లెట్లు, క్యాప్సల్స్‌తో కూడిన కోవిడ్‌ కిట్‌ తప్పనిసరిగా అందించాలి’.

ఆక్సీజన్‌ సరఫరా:
‘ఆస్పత్రుల్లో ఆక్సీజన్‌ సరఫరా పూర్తి స్థాయిలో ఉండాలి. విశాఖలో ప్రొడక్షన్‌ సెంటర్‌ నుంచి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేలా చూసి, దాన్ని అన్ని 108 ఆస్పత్రుల్లో తగినంత ఆక్సీజన్‌ ఉండేలా చూడండి. అదే విధంగా రెమ్‌డెస్‌విర్‌ ఇంజక్షన్లు. రోగులకు అవసరమైన ఇంజక్షన్లు అన్ని చోట్ల అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంజక్షన్‌ లేకుండా ఏ ఒక్క రోగి కూడా ఇబ్బంది పడకుండా చూడాలి’.

కాగా, రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఇప్పుడు 6.03 శాతం ఉందని సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కోవిడ్‌ చికిత్స కోసం రాష్ట్రంలో 108 ఆస్పత్రులు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉండగా వాటిలో 15,669 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, వాటిలో ఇప్పుడు 4,889 బెడ్లు ఆక్యుపైడ్‌ కాగా, 1,987 వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయని, నిన్నటి (బుధవారం) వరకు మొత్తం 22,637 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు.

డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, మున్సిపల్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌చంద్ర, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పాఠశాల విద్య శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్