Sunday, November 24, 2024
HomeTrending Newsపోడు భూములపై కెసిఆర్ మోసపూరిత హామీలు- రేవంత్ రెడ్డి

పోడు భూములపై కెసిఆర్ మోసపూరిత హామీలు- రేవంత్ రెడ్డి

“అభివృద్ధి పేరుతో పార్టీ మారిన ఎమ్యెల్యే రేగాకాంతారావుకు సవాల్ విరుతున్నా. పినపాక నియోజకవర్గంలో ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో అక్కడ మేం ఓట్లు అడుగుతాం. డబుల్ బెడ్రూం ఉన్న గ్రామాల్లో బీఆరెస్ ఓట్లు అడగాలి. ఈ సవాలుకు సిద్ధమా?” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా 7వరోజు పినపాపక నియోజకవర్గం పరిధిలో అశ్వాపురం మండలం గొల్లగూడెం నుంచి మణుగూరు అంబేద్కర్ సెంటర్ వరకు దాదాపు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మణుగూరు అంబేద్కర్ సెంటర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ ప్రాంతంలో ప్రధానమైన సమస్య పొడుభూములకు పట్టాలు. భూమి కన్నతల్లి లాంటిది.. మనకు జీవనాధారం. పోడు భూములకు పట్టాలు ఇస్తానని కేసీఆర్ చెప్పి తొమ్మిదేళ్లయినా సమస్య పరిష్కారం కాలే. పోడు భూములకు పట్టాలిస్తామని కాంగ్రెస్ చెప్పగానే కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టింది. అందుకే అసెంబ్లీలో పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిండు. తొమ్మిదేళ్లలో చేయలేనోడు తొమ్మిది నెలల్లో చేస్తాడన్న నమ్మకం లేదు. అందుకే కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి పోడు భూములకు పట్టాలు తెచ్చుకుందాం. ఇక్కడ గోదావరి ముంపు బాధితులకు ఇళ్లు ఇస్తామని కేసీఆర్ మోసం చేసిండు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ పేదవాడికి ఇళ్లు నిర్మించుకునేందుకు రూ. 5 లక్షలు సాయం అందిస్తాం.

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు క్రీయాశీలకంగా పాల్గొన్నారు. కానీ ఆయా సంస్థలకు చెందిన లక్షా 50 వేల కార్మికులు ఇప్పుడు గోస తీస్తున్నారంటే దానికి కారణం కేసీఆర్ కాదా ? ఈ ప్రాంతం ఉద్యమాలకు పోరాటాలకు పుట్టినిల్లు. ఇక్కడి ప్రజల్ని మోసం చేస్తే కేసీఆర్ ను రాజకీయంగా పాతరేస్తారు. మోదీ డబుల్ ఇంజన్ సర్కారు అంటే.. డీజిల్, పెట్రోల్ ధరలను డబుల్ చేయడమా? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 500లకే సిలిండర్ ఇచ్చి పేదలను ఆదుకుంటాం. అభివృద్ధి పేరుతో పార్టీ మారిన స్థానిక ఎమ్యెల్యే సన్నాసికి సవాల్ విరుతున్నా. పినపాక నియోజకవర్గంలో ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నయో గ్రామాల్లో మేం ఓట్లు అడుగుతాం. డబుల్ బెడ్రూం ఉన్న గ్రామాల్లో అక్కడే బీఆరెస్ ఓట్లు అడగాలి. ఈ సవాలుకు సిద్ధమా? దీనికి సిద్ధపడితే బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ కూడా రాదు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు సాయం అందిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుగా మార్చుకుంటారా? పిర్యాదు చేసిన పార్టీ కార్యకర్తలపైనే పోలీసులు కేసులు పెడతారా? కబ్జా చేసిన పార్టీ ఆఫీసును తిరిగి ఇచ్చేయండి. లేకపోతే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో… ఇదే పోలీసులతో రేగా కాంతారావుకు బేడీలు వేయించి పార్టీ ఆఫీసు ముందు నుంచి తీసుకెళ్లేలా చేస్తా. నేను మాట్లాడిన మాటల మీద నిన్న అసెంబ్లీలో కేసీఆర్ కాళ్లు విరుగుతాయ్ అని అన్నడు. నేను సవాలు విసురుతున్నా కేసీఆర్ కు ఎక్కడికి రమ్మంటావో చెప్పు. మా కార్యకర్తలతో వస్తా… ఎవరి కాళ్లు విరుగుతాయో తేల్చుకుందాం. నిన్న అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ పాలనను పొగిడిండు. తద్వారా మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరవ్వాలని కేసీఆర్ చూస్తుండు. నోట్ల రద్దు, త్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇలా ప్రతి అంశంలో బీజేపీకి మద్దతు ఇచ్చిన కేసీఆర్ ను కాంగ్రెస్ నమ్మే ప్రసక్తే లేదు. కేసీర్ కు కాలం చెల్లింది.. ఆయన రద్దైన వెయ్యి నోటు లాంటివాడు. కాలనాగునైనా కౌగిలించుకుంటాం కానీ కేసీఆర్ ను నమ్మం.

కల్వకుంట్ల కుటుంబంతో కలవం. తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తా అని కేసీఆర్ కుటుంబంతోసహా సోనియాగాంధీ కాళ్ల మీద పడ్డారు. అప్పుడే కొంత మంది చెప్పారు కేసీఆర్ ను నమ్మద్దు అని. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ విఫలమైనప్పుడు జానారెడ్డి ఇంట్లో జేఏసీ ఏర్పడింది. జేఏసీకి జెండాలు కట్టింది మనం. దొరగారికి దండాలు పెట్టింది మనం. రాష్ట్ర ఏర్పాటు అలస్యమైతే ప్రాణాలు తీసుకుంది మనం. కానీ వచ్చిన తెలంగాణ ఏవడి పాలైందో మీరే ఆలోచించండి. అమరుల కుటుంబాలు అనాథలయ్యాయి. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు ఆగలేదు. విద్యార్ధులు జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. తెలంగాణలో ఎక్కడ చూసిన ఆరణ్యరోదనలే. అటు మోదీ, ఇటు కేడీ తెలంగాణ కష్టాలు తీర్చరు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ కు మాత్రమే ఇక్కడి ప్రజల కష్టాలు తెలుసు. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ.. టీఆరెస్ దొరల పార్టీ. కాంగ్రెస్ పేదలు, దళిత, గిరిజన, మైనారిటీల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు. దళితుడిని పార్టీ అధ్యక్షుడిని చేసే దమ్ము బీఆరెస్ కు ఉందా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తేనే తెలంగాణ కష్టాలు తీరుతాయి.

మణుగూరు సభ కంటే ముందు మహబూబాబాద్ పార్లమెంట్ బూత్ స్థాయి ఎన్‌రోలర్స్‌తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో యాత్రను విజయవంతం కావడానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరంపై దిశానిర్దేశం చేశారు. నాలుగేళ్లు ఒక ఎత్తు.. ఈ తొమ్మిది నెలలు ఒకెత్తు. ఎన్నో కుట్రలను ఎదుర్కొంటు కార్యకర్తలు పార్టీని కాపాడినందుకు ఎన్‌రోలర్స్‌ను అభినందించారు.

Also Read : మేడారం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్