Monday, September 23, 2024
HomeTrending Newsహైదరాబాద్ వనస్థలిపురంలో బస్ టెర్మినల్

హైదరాబాద్ వనస్థలిపురంలో బస్ టెర్మినల్

అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన అరణ్య భవన్ లో రాష్ట్ర వన్యప్రాణి మండలి (వైల్డ్ లైఫ్ బోర్డు), మనుషులు – జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం (Human- Animal Conflict) తగ్గించే చర్యల సూచనల కమిటీ సమావేశాలు జరిగాయి.

అటవీశాఖ నేతృత్వంలో అడవుల రక్షణ, వన్యప్రాణి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను సమావేశంలో పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ వివరించారు. రాష్ట్రంలో మొదటి సారి చేపట్టిన పులుల ఆవాసాల్లో ఉన్న మానవ ఆవాసాల తరలింపు (కవ్వాల్ లో రెండు గ్రామాలు) ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపారు. మనుషులు, వన్యప్రాణులకు మధ్య ఘర్షణ వాతావరణం నిరోధించేందుకు అవసరమైన చర్యలను కూడా కమిటీ చర్చించింది. వన్యప్రాణుల (పులులతో సహా) దాడుల్లో చనిపోయిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పరిహారం అధ్యయనం చేసిన తర్వాత బోర్డు ఈ కొత్త ప్రతిపాదనలు చర్చించింది.

ప్రస్తుతం ఐదు లక్షలు ఉన్న పరిహారాన్ని పది లక్షలకు పెంచుతూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనున్నారు. సాధారణ గాయాలైతే వాస్తవ వైద్యం ఖర్చు (లక్ష రూపాయలకు మించకుండా), తీవ్రంగా గాయపడితే వైద్యానికి అయ్యే ఖర్చు (మూడు లక్షల రూపాయలకు మించకుండా), అంగవైకల్యం ఏర్పడితే లక్ష రూపాయల పరిహారం, పెంపుడు జంతువులు చనిపోతే వాస్తవ అంచనా, యాభై వేల రూపాయలకు మించకుండా, అలాగే పంట నష్టానికి ప్రస్తుతం ఎకరాకు ఆరువేలు ఉన్న పరిహారాన్ని ఏడువేలా ఐదు వందల రూపాయలకు పెంచాలని, పండ్లతోటలకు నష్టపరిహారం కూడా ఏడువేలా ఐదు వందల రూపాయలకు (గరిష్టంగా యాభై వేల రూపాయల దాకా) కమిటీ ప్రతిపాదించింది.

వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశం
స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల (25.01.2023) జీవో నెంబర్ మూడు ద్వారా పునర్ వ్యవస్థీకరించింది. ఆ తర్వాత జరిగిన తొలి సమావేశం ఇది. ఈ సమావేశంలో స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.

గత బోర్డు సమావేశంలో 24 ప్రతిపాదనలు అటవీ అనుమతుల కోసం రాగా, 15 అప్లికేషన్లను పరిశీలించి అనుమతుల కోసం నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డుకు పంపామని, మిగతా తొమ్మిది రాష్ట్ర పరిధిలో ఉన్నాయని తెలిపారు. తాజాగా మరో ఏడు ప్రతిపాదనలు ఇవాళ సమావేశంలో బోర్డు ముందు ఉంచి చర్చించారు.

హైదరాబాద్ వనస్థలిపురంలో బస్ టెర్మినల్ నిర్మాణానికి వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. హరిణ వనస్థలికి చెందిన 1. 354 హెక్టార్ల అటవీ భూమి నిబంధనలకు అనుగుణంగా మళ్లింపును అనుమతిని ఇచ్చారు. జాతీయ రహదారిలో విపరీతంగా పెరిగిన రద్దీ, ప్రయాణీకుల సౌకర్యం కోసం ఈ టెర్మినల్ నిర్మాణం కానుంది. అయితే హరిణ వనస్థలి కోసం అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది.
శ్రీశైలం రహదారి విస్తరణ కోసం వచ్చిన ప్రతిపాదనను అమ్రాబాద్ లో ఉన్న వన్యప్రాణి సంరక్షణను దృష్టిలో పెట్టుకుని బోర్డు తిరస్కరించింది. ఇతర రోడ్డు, ఇరిగేషన్, (కడెం పరిధిలో లక్ష్మీపూర్ లిప్ట్, నాగార్జున సాగర్ పరిధిలో పెద్ద గుట్ట లిప్ట్) కేబుల్ పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. వన్యప్రాణులు ప్రమాదంలో పడ్డప్పుడు కాపాడేందుకు అవసరమైన రెస్క్యూ టీమ్ ల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు.

సమావేశంలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, ఇతర సభ్యులు కోవ లక్ష్మి, రాఘవ, బానోతు రవి కుమార్, అనిల్ కుమార్, పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ) ఎం.సీ. పర్గెయిన్, అటవీశాఖ అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి, ఓఎస్డీ శంకరన్, ఇతర అధికారులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్