పాఠశాల విద్యార్థులకు పర్యావరణం ప్రాధాన్యత, అడవులను కాపాడాల్సిన ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో పరిచయం చేయాలన్న సంకల్పంతో తెలంగాణ అటవీశాఖ వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న ఈ వనదర్శని కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. తాజాగా మేడ్చల్ జిల్లా అటవీశాఖ నేతృత్వంలో కీసర రిజర్వ్ ఫారెస్ట్ లో వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులను కీసర అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడి వివిధ రకాల చెట్లు, ఔషధ మొక్కలను పిల్లలకు అటవీ అధికారులు పరిచయం చేశారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉండే అడవుల వల్ల ఉపయోగాలు, అడవులపై పెరుగుతున్న ఒత్తిడిని విద్యార్థులకు అర్థం అయ్యేలా వివరించారు.
రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దత్తత తీసుకుని అభివృద్ది చేస్తున్న కీసర ఎకో అర్బన్ పార్క్ ను విద్యార్థులు సందర్శించి, కాసేపు సేదతీరారు. విద్యార్థుల వనదర్శిని కార్యక్రమం వివరాలను ట్విట్టర్ లో షేర్ చేసిన సంతోష్ కుమార్ ఆనందాన్ని వ్యక్తంచేశారు. అటవీశాఖ చాలా మంచి పనిచేస్తోందని, తాను దత్తత తీసుకుని అభివృద్ది చేస్తున్న అర్బన్ ఎకో పార్క్ ఫలితాలను ఇస్తోందని అని అన్నారు. విద్యార్థులు పర్యావరణ జ్ఞానం పెంచుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం అన్నారు.
ఈ వనదర్శని కార్యక్రమం బాగుందని, తాము అడవుల ప్రాధాన్యతతో పాటు, వివిధ రకాల జంతువులు, మొక్కల గురించి నేర్చుకున్నామని, పర్యావరణం ప్రాధాన్యత, కాపాడటంలో తమ బాధ్యత తెలిసి వచ్చిందని విద్యార్థులు ఆనందంగా తెలిపారు. విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించిన అధికారులు బహుమతులు అందించారు. క్లాస్ రూమ్ విద్యతో పాటు విద్యార్థులను ఇలా అడవికి తీసుకువచ్చి పరిచయం చేయటం, వివరించటం చాలా మంచి కార్యక్రమం అని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా డీఎఫ్ఓ జానకిరామ్, స్థానిక అటవీ అధికారులు, నాగారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Also Read : కవాల్ టైగర్ రిజర్వు.. గ్రామాల తరలింపు వేగవంతం