విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహనిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. విగ్రహ నిర్మాణ పనుల్లో ఎక్కడా ఎటువంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నిర్ణీత గడువు ప్రకారంగానే ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని ఆయన చెప్పారు. విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మెన్ మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో రాష్ట్ర నలుగురు మంత్రుల బృందం మంగళవారం హర్యానా రాష్ట్రంలోని మానేసోర్ నందు సందర్శించి అక్కడ జరుగుతున్న విగ్రహ నిర్మాణపనులను పరిశీలించింది. ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు ఈ బృందంలో ఉన్నారు.
ఈ సందర్భంగానే మేరుగు నాగార్జున మాట్లాడుతూ, ఈ విగ్రహాన్ని రాబోయే అంబేద్కర్ జయంతి రోజున ఆవిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారని, విగ్రహ నిర్మాణ పనులను మంత్రులతో పాటుగా ముఖ్యమంత్రి కూడా స్వయంగా సమీక్షిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో అటు విజయవాడ స్వరాజ్ మైదాన్ లో అంబేద్కర్ స్మృతివనంకు సంబంధించిన నిర్మాణ పనులు, ఇటు ఢిల్లీలో రూపుదిద్దుకుంటున్న విగ్రహ నిర్మాణ పనులు కూడా వేగంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. ఒకవైపు విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతుండగానే మరోవైపున విగ్రహ ప్రాంతానికి చేరుకొనే రహదారులు, ప్రహారీ, లోపలివైపున పాదచారులు నడిచేందుకు అంతర్గత రోడ్లు, విగ్రహ ప్రాంగణం చుట్టూ సుందరీకరణ పనులను కూడా పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే విగ్రహానికి సంబంధించిన పలు విడిభాగాలు విజయవాడకు చేరుకున్నాయన్నారు. రూ.268 కోట్లతో నిర్మించాలనుకున్న ఈ అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఖర్చు ఎంతగా పెరిగినప్పటికీ స్మృతివనం పనుల్లో ఎక్కడా ఆలస్యం జరగకుండా అన్ని చర్యలూ తీసుకోవడం జరుగుతోందని వివరించారు. విగ్రహాన్ని నిర్మిస్తున్న శిల్పులతో మంత్రులు మాట్లాడారు. ప్రస్తుతం విజయవాడకు చేరుకున్న విగ్రహం విడిభాగాలు కాకుండా విగ్రహానికి సంబంధించిన ఇతర భాగాలు ఎప్పటికి రాష్ట్రానికి చేరుకుంటాయనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. కాగా మంత్రుల బృందంతో పాటుగా సాంఘిక సంక్షేమశాఖ, ఏపీఐఐసి, కేపీసీలకు చెందిన పలువురు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.