సమంత అభిమానులంతా ఇప్పుడు ‘శాకుంతలం’ సినిమా కోసం ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఒక అందమైన దృశ్యకావ్యంగా ప్రేక్షకులను అలరించనుంది. దిల్ రాజు సమర్పిస్తున్న ఈ సినిమాలో శకుంతలగా సమంత నటిస్తుండగా, దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నాడు. తెలుగులో ఆయనకి ఇదే ఫస్టు మూవీ. కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి ఒక్కో పాటను వదులుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా నుంచి మరో మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘మధుర గతమా కాలాన్నే ఆపకా .. ఆగావే సాగకా’ అంటూ ఈ పాట సాగుతోంది. నాయకా నాయికలకి ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో ఈ పాట ఉంటుందనే విషయం సాహిత్యాన్ని బట్టి అర్థమవుతోంది.
ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా .. అర్మాన్ మాలిక్ – శ్రేయా ఘోషల్ ఆలపించారు. మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. గౌతమి .. ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. గుణశేఖర్ పకడ్బందీ స్క్రిప్ట్ తో చాలా ఫాస్టుగా షూటింగును పూర్తి చేసినప్పటికీ, గ్రాఫిక్స్ పరంగా ఎక్కువ సమయమే తీసుకున్నారు. అందుకు తగిన అవుట్ పుట్ వచ్చిందనే అర్థమవుతోంది. ఇటు గుణశేఖర్ కెరియర్లోను .. అటు సమంత కెరియర్లోను ఈ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందనే అనిపిస్తోంది.