జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్.. కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అటునుంచి రోడ్డుమార్గంలో అంజన్న క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయం వద్ద సీఎం కేసీఆర్‌కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రులు, ప్రజాప్రతినిథులు, అధికారులతో కలిసి కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించారు.
అనంతరం జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సమాలోచనలు జరుపుతారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి రానున్నారు. ఇప్పటికే కొండగట్టు అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.