సిఎం జగన్ ను నారా లోకేష్ ఒరేయ్, గిరేయ్, నువ్వు.. అంటూ ఏకవచన సంబోధనతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ రామ్ హెచ్చరించారు. గురువారం రాజమండ్రిలో భరత్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ నేత, సిఎం జగనన్నపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడానికి ‘ఏంట్రా..నీ స్థాయి’ అంటూ నిలదీశారు. ‘నీకంటూ ఏమైనా ప్రత్యేకత ఉందా..అడ్డదార్లలో ఎమ్మెల్సీ, ఆ తరువాత మంత్రి పదవి..అంతే కదా… కనీసం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజల నుండి గెలిచావా అంటే అదీ లేదు..రాష్ట్రంలో పాదయాత్ర ఏంచూసి, ఏ ఉద్దేశంతో చేస్తున్నావో కూడా తెలియదు..ఏపీ బోర్డర్ తెలియదు..కర్నాటక పోయి ‘అమ్మ వడి’ వచ్చిందా అని అడిగి నాలుక్కర్చుకున్నావ్” అని భరత్ నిప్పులు చెరిగారు.
సిఎంపై అనుచిత విమర్శలు మరోసారి చేస్తే యాత్రను ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. “నీకేమైనా సత్తా ఉంటే నాతో పోటీపడు..నేను ఎంపీగా మా జగనన్న, ప్రజల ఆశీస్సులతో నెగ్గాను. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలలో మాట్లాడతా..నువ్వే భాషలో అనర్గళంగా మాట్లాడగలవో చెప్పు” అంటూ సవాల్ విసిరారు. హైదరాబాదులో మకాం పెట్టి టూరిస్టులు మాదిరిగా వీకెండ్ కు ఓసారి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ డ్రామాలు చేస్తారా?..అంటూ లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.