Sunday, November 24, 2024
HomeTrending Newsనేను తెచ్చిన డిక్స‌న్ కంపెనీ: లోకేష్

నేను తెచ్చిన డిక్స‌న్ కంపెనీ: లోకేష్

గత ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకు వచ్చానని, కానీ  ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రానికి కనీసం ఒక్క పరిశ్రమ అయినా తీసుకు వచ్చారా అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. యువ గళం పాదయాత్ర చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో సాగుతోంది. ఆ సందర్భంలో డిక్సన్ కంపెనీ బస్సు తమ సంస్థ ఉద్యోగులను తీసుకు వెళ్తూ కనిపించింది.  లోకేష్ ఆ బస్సులోకి ఎక్కి మహిళా ఉద్యోగులను పలకరించారు. తన హయంలోనే డిక్సన్ కంపెనీ వచ్చిందని ఇంతమంది మహిళలకు అక్కడ ఉపాధి దొరకడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా లోకేష్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…

“స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర సాగుతోంది. నాకు ఎదురుగా డిక్స‌న్ కంపెనీ బ‌స్సు క‌నిపించింది. ఆ బ‌స్సు నిండా అక్కాచెల్లెళ్లు, వారి మోముల్లో న‌న్ను చూసిన ఆనందం. నా క‌ళ్ల వెంబ‌డి ఆనంద‌భాష్పాలు అప్ర‌య‌త్నంగానే రాలాయి. నాలుగేళ్ల క్రితం నేను ఐటీ-ఎల‌క్ట్రానిక్స్ శాఖా మంత్రిగా తీసుకొచ్చిన కంపెనీ ఈ రోజు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా వేలాది మందికి ఉపాధి క‌ల్పిస్తోంది. నేను ఇప్పుడు ప‌ద‌విలో లేను. కానీ నా ప్ర‌య‌త్నం వేలాది మంది జీవితాల‌కు ఉపాధి మార్గం చూపింది. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే ఒక వ‌న‌రు అయ్యింది. ఆంధ్ర అభివృద్ధిలో డిక్స‌న్ కూడా ఒక భాగ‌మైంది.

“చిలుకను పెంచాను ఎగిరిపోయింది. ఉడుత‌ను పెంచాను. పారిపోయింది. మొక్కను పెంచాను. ప్రస్తుతం ఆ రెండూ వచ్చి చేరాయి” అని మిసైల్ మేన్, మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం చెప్పిన నిత్య‌స‌త్యం నేను న‌మ్మే సిద్ధాంతం. మీలాంటి వారి విమ‌ర్శ‌లు-ఆరోప‌ణ‌లు-హేళ‌న‌ల‌కు వెర‌వ‌కుండా అష్ట‌క‌ష్టాలు ప‌డి తెచ్చిన కంపెనీలు ప‌చ్చ‌ని చెట్లు అయ్యాయి. ఈ నీడ‌న ఉపాధి దొరుకుతోంది. ఇంత‌కుమించిన ఆనందం ఏముంటుంది. నేను ఏపీకి తీసుకొచ్చిన డిక్సన్‌లో ఈ అక్కాచెల్లెళ్లు ఉద్యోగానికి వెళ్ల‌డం చూసి నా గుండె గర్వంతో ఉప్పొంగింది. అప్ప‌ట్లో డిక్స‌న్‌ 100 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ కంపెనీ వ‌ల్ల 1000 మందికి ప్రత్యక్షంగా, 5000 పరోక్ష ఉపాధి దొరికింది. నేను ప‌దుల‌సంఖ్య‌లో కంపెనీలు తెచ్చి వేలాది మందికి ఉపాధి క‌ల్పించాను. అన్ని కాక‌పోయినా ఒక్క కంపెనీ తెచ్చి యువ‌త‌కి ఉపాధి క‌ల్పించి చూపించ‌గ‌ల‌వా మిస్ట‌ర్ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డీ” అంటూ లోకేష్ మాట్లాడారు.

Also Read : నేను చెప్పినా వినకుండా…: బాబు

RELATED ARTICLES

Most Popular

న్యూస్