రేవంత్, షర్మిల ల మాటలన్నీ అబద్ధాలేనని, వారి ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెగేసి చెప్పారు. నిరూపించలేక పోతే వారు తమ పదవులకు రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకోవాలని సవాల్ చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో పాద యాత్రల సందర్భంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ysrtp అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యల పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి తో పాటు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ zp చైర్మన్ సంపత్ రెడ్డి, ఎడవెల్లి కృష్ణా రెడ్డి, తదితర నాయకులు ఉన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్:
రేవంత్, షర్మిలకు తెలంగాణ ఉద్యమంతో సంబధం ఉందా? రేవంత్ చంద్రబాబు ఏజెంట్! నేను ఇంటర్ చేశా… పెద్దగా చదువుకోక పోయినా… ప్రజల మనోభావాలు చదివిన. ప్రజల అవసరాలను తీరుస్తున్న.. అభివృద్ధి చేస్తున్న. ప్రజలు నన్ను అందుకే గెలిపిస్తూ వస్తున్నారు. 6 సార్లు ఓటమి లేకుండా గెలిచిన ఎమ్మెల్యేని ఒకసారి ఎంపీగా కూడా గెలిచిన… రేవంత్, షర్మిల లు అలవిగాని అబద్ధాలు చెప్పారు. రేవంత్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన లేదు. నేను తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబుతో లెటర్ ఇప్పించాను. తెలంగాణ కోసం రేవంత్ ఏమి చేశాడో చెప్పాలి. రేవంత్… నీ మీద ఉద్యమ కేసు ఒక్కటి అయినా ఉందా?!
రేవంత్ మాత్రమే కాదు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరి పైనా భూ దందాలో కబ్జా కేసులు ఉన్నాయి. వాళ్ళు ప్రజల కోసం జైలు కు పోలే. కుంభకోణాలు, కుట్రలు, కుతంత్రాల కేసుల్లో జైలుకు పోయారు. రేవంత్, ఓటుకు నోటు కేసులో జైలుకు పోయాడు. వాళ్ళు ఎన్నో కుంభకోణాలు, కుట్రలు, కుతంత్రాలు చేశారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ప్రజల కోసం జైలుకు పోయాను. ప్రజల కోసం కేసులు అనుభవిస్తున్నాను. నీటి కోసం బాబ్లీకి పోయి, పోలీస్ లతో దెబ్బలు తిన్న…గ్రానైట్ సమస్యలపై పోరాడితే, అనంతపూర్ లో కేసులు పెట్టారు. నేను రాజకీయాల్లో మళ్లీ గెలుస్తా.. ఎక్కడ నిలబెట్టిన మళ్ళీ మళ్ళీ గెలుస్తా…
రేవంత్…నీవు నీ కొడంగల్ లో గెలుస్తవా? మల్కాజిగిరి లో మళ్లీ పోటీ చేస్తావా? నీవు నా గురించి మాట్లాడే వాడివయ్యావా? నీ గురించి నీ కాంగ్రెస్ వాళ్లే మాట్లాడుతున్నారు. నీవు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనమే. గతంలో 15 సీట్లు గెలిచిన కాంగ్రెస్, ఇప్పుడు 5 సీట్లు కూడా గెలవలేని స్థితికి రేవంత్ వల్లే వచ్చింది. మీ పాద యాత్ర ను నిలిపి వేస్తామని మా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పట్టు పడితే, నేనే, వద్దని వారించిన. వాళ్ళు చచ్చిన పాములు… వద్దని నేనే వాళ్ళను ఆపిన. నేనే ఒకవేళ అడ్డుకావాలనుకుంటే, మీరు జనగామ జిల్లాలో, పాలకుర్తి నియోజకవర్గంలో తిరిగే వారా?
అమ్మా షర్మిలా.. కొద్దో గొప్పో మీ నాయినకు మంచి పేరు ఉంది. దాన్ని చెడగొట్టకు…మాటలు మంచిగా రానివ్వమ్మా.. కొంచెమైనా.. సంస్కారాన్ని పాటించి మాట్లాడు. నువ్వు మహిళవి అన్న సంగతి మరచి పోవద్దు.. నీ మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మహిళల గౌరవం కాపాడు…మీ ఆరోపణలు చూసి అంతా సిగ్గు పడుతున్నారు. మీ విజ్ఞతకు.. సంస్కారానికి వదిలివేస్తున్న…పాలకుర్తిలో హాస్పిటల్ లేదని అంటున్నారు….జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజీ ఇచ్చాక… పెద్ద హాస్పిటల్ వచ్చింది. జనగామకు సమీపంలోనే ఉన్న పాలకుర్తికి ఆ అవసరం లేదని మాత్రమే ఇవ్వలే. పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ కు డిగ్రీ కాలేజీ మంజూరు అయింది ముందు ఆ విషయం తెలుసుకో. రాయపర్తి సమీపంలోని మహబూబ్ నగర్ లో ముస్లిం ల భూములు అక్రమించానని… ఆరోపిస్తున్నారు. కానీ అది ఎవరి పేరు మీద ఉందో తెలుసుకొని మాట్లాడు. 500 మంది కిరాయి గూండాలు… 200 కార్లు… కాంట్రాక్ట్ పద్ధతిలో పాద యాత్ర చేస్తున్న మీరు మా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
రేవంత్, షర్మిల లు…పాద యాత్రల పరువు తీస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ, రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. కెసిఆర్ లేకపోతే తెలంగాణ ఎడారి అయ్యేది. దేవాదుల ప్రాజెక్టు అన్యాయం అయింది కాంగ్రెస్ హయంలోనే…టిడిపి ఇంకా అన్యాయం చేసింది. సీఎం కెసిఆర్ వచ్చాకే… దేవాదుల ప్రాజెక్టుకు మహర్దశ వచ్చింది. 100 కోట్లు అదనంగా పెట్టి మరీ ప్రాజెక్ట్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత కెసిఆర్ ది. మొత్తం 375 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దేవాదుల నీటితో చెరువులు నింపినం. ఇవ్వాళ గ్రామాల్లో చెరువులు నీటితో నిండి… నిండు కుండలా ఉన్నాయి