హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)కు సమీపంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉన్న బాచుపల్లి హెచ్ఎండిఏ లేఅవుట్ లో ప్లాట్లను సొంతం చేసుకోవడానికి ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం బాచుపల్లి లేఅవుట్ లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఉన్నతాధికారులు శుక్రవారం నిర్వహించిన సమావేశానికి వచ్చిన ఆదరణనే ఇందుకు నిదర్శనం. దాదాపు 250 మందికిపైగా ఔత్సాహికులు ఫ్రీ బిడ్ సమావేశానికి హాజరు కావడం విశేషం.
ఈ ప్రీ బిడ్ సమావేశంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, హెచ్ఎండిఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్(సీపీఓ) గంగాధర్, మల్కాజ్ గిరి రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డీవో) మల్లయ్య, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ప్రతినిధులు అనురాగ్, ధనుంజయ్ లతోపాటు ఐసిఐసిఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రతినిధులు హాజరయ్యారు.
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల, మియాపూర్ క్రాస్ రోడ్డుకు, ఐటి హబ్ కు సమీపంలో ఉన్న బాచుపల్లి లేఅవుట్ పరిసరాల్లో పలు గెటడ్ కమ్యూనిటీ విల్లా వెంచర్ల మధ్యలో ఉండడం వల్ల ఎంతోమంది ఇక్కడి ప్లాట్లను కొనుగోలు చేయడానికి ప్రవాస భారతీయుల కుటుంబ సభ్యులు, బిల్డర్లు, డెవలపర్లు ఎంతో ఆసక్తితో ఉన్నారు. బాచుపల్లి లేఔట్ లో ఫ్లాట్ల సైజులు 266 చదరపు గజాల నుంచి 487 చదరపు గజాల వరకు గల ప్లాట్లు ఉండడం, అవి కూడా కూడా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో రూ.25,000లు (అప్ సెట్ ప్రైస్) ఉండడం విశేషం.
ప్రీ బిడ్ సమావేశంలో హెచ్ఎండి అధికారులు లేఔట్ ప్రాధాన్యతను, వాటి పరిసరాల ప్రాముఖ్యతను గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ప్రతినిధులు అధికారులు ప్లాట్ లను ఆన్ లైన్ పద్ధతిలో అనుసరించాల్సిన విధానాన్ని, నియమ నిబంధనలను గురించి వారికి వెల్లడించారు.