టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ కోవిడ్ కారణంగా ఒలింపిక్స్ కు దూరమైంది. అమెరికాకు చెందిన ఈ యువ సంచలనం ఇటీవలి కాలంలో తన ఆటతీరుతో టెన్నిస్ అభిమానుల ప్రసంశలు అందుకుంటోంది.
‘కోవిడ్ కారణంగా టోక్యో ఒలింపిక్స్ కు దూరమవ్వాల్సి వస్తోంది, ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు బాధగా ఉంది. విశ్వ క్రీడలైన ఒలింపిక్స్ లో అమెరికా తరఫున ఆడడం గొప్ప గౌరవంగా భావిస్తాను, ఈసారి కాకపోయినా భవిష్యత్ ఒలింపిక్స్ లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించి నా కలను సాకారం చేసుకుంటాను” అని ట్వీట్ చేసింది కోకో.
కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో కోకో ఈ ఒలింపిక్స్ లో ఆడబోవడం లేదని యూఎస్ టెన్నిస్ అసోసియేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఈ 17 ఏళ్ళ యువ సంచలనం ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్(డబ్ల్యూ టి ఏ) ర్యాంకింగ్స్ సింగిల్స్ విభాగంలో 25వ స్థానంలో కొనసాగుతోంది. తన 15 వ ఏటనే 2019 లింజ్ ఓపెన్ టైటిల్ గెల్చుకొని తన తొలి డబ్ల్యూటిఏ టైటిల్ ను కైవసం చేసుకుంది. సెరెనా, వీనస్ విలియమ్స్ సోదరీమణుల స్పూర్తితో తాను టెన్నిస్ లోకి అడుగుపెట్టినట్లు కోకో చెప్పారు.