సిఎం జగన్ పై చంద్రబాబు రోజూ విషప్రచారం చేస్తున్నారని రాష్ట్ర బిసి సంక్షేమ, ఐ అండ్ పి ఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు. చంద్రబాబు సభల పేరుతో 11 మందిని బలితీసుకున్నారని, అందుకే రోడ్లపై సభలు వద్దని జీవో నంబర్ వన్ తీసుకు వచ్చామని అన్నారు. ఈ జీవోను ప్రభుత్వం అమలు చేస్తుంటే అడ్డుకోవడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు.
చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై, వ్యవస్థలపై గౌరవం లేదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబు సైకోగా మారి సిఎం జగన్ పై అలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఓ విఫల నాయకుడని, గత ఐదేళ్ళ కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నీ ప్రజా వ్యతిరేకమైనవేనని పేర్కొన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎం లాగా వాడుకున్నారని సాక్షాత్తూ ప్రధాని మోడీ ఆరోపించిన విషయాన్ని చెల్లుబోయిన గుర్తు చేశారు.
సభల పేరుతో చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడి వెళుతున్నారని, అసలు ఆయనకు సహాయ నిరాకరణ అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాలను, చట్టాలను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో బాబుకు తెలియదా అని అడిగారు. నిన్న అనపర్తిలో టిడిపి కార్యకర్తలు గుండాల మాదిరిగా ప్రవర్తించి, పోలీసులను రెచ్చగొట్టి లాఠీఛార్జ్ జరిగేలా చేయాలని చూశారని, అయితే పోలీసులు సంయమనం పాటించారని మంత్రి వివరించారు. పోలీసుల పట్ల బాబు వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగా లేదని, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి ఆయన ప్రయతిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాలతో పేదవారి జీవతాల్లో మార్పులు తీసుకు వచ్చిన ఘనత సిఎం జగన్ కే దక్కుతుందన్నారు. అలాంటి సిఎంపై అనుచితంగా వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి హెచ్చరించారు.
Also Read : చట్ట ప్రకారం పనిచేయండి: బాబు సూచన