సినీ నటుడు, నందమూరి ఫ్యామిలీ హీరో తారకరత్న శనివారం రాత్రి బెంగుళూరు హృదయాలయ హాస్పటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 23 రోజులు మృత్యువుతో పోరాడి ఆఖరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకున్నారు. ఇంతలో ఇలా జరగడం చాలా బాధగా ఉంది అంటూ అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తారకరత్న భౌతికకాయన్ని ఆయన నివాసంలోనే ఉంచారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, విజయసాయి రెడ్డి తదితరులు కడసారి తారకరత్న భౌతిక కాయాన్ని చూసి నివాళులు అర్పించారు. ఈ రోజంతా ఇంట్లోనే భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఫిల్మ్ ఛాంబర్ లో భౌతికకాయాన్ని ఉంచి సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయనున్నారు. ఇరవైకు పైగా చిత్రాల్లో నటించిన తారకరత్న ఇక నుంచి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకున్నారు. ఇలాంటి టైమ్ లో ఇలా జరగడం దురదృష్టకరం.