బలమైన సినిమా నేపథ్యం కలిగిన ఫ్యామిలీస్ నుంచి వచ్చే హీరోలకు, తమ లోపాలు తాము తెలుసుకుని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి నేపథ్యం లేనివారు ఎంత త్వరగా తాము చేస్తున్న పొరపాట్లను గ్రహించి అంత త్వరగా వాటిని సరిదిద్దుకోవలసి ఉంటుంది. నేను మెప్పించేవరకూ వెయిట్ చేయండి అంటే ప్రేక్షకులు ఎంతమాత్రం వినిపించుకోరనేది చాలామంది హీరోల విషయంలో నిజమైంది.
సంతోష్ శోభన్ విషయానికి వస్తే ఆయన కూడా కాస్త ఆగి .. ఆలోచించి .. నిలకడగా ముందుకు వెళ్లవలసి ఉంటుందనే విషయం అర్థమవుతుంది. డైరెక్టర్ శోభన్ తనయుడిగా సంతోష్ ఇండస్ట్రీకి వచ్చాడు. చకచకా సినిమాలు చేస్తూ వెళ్లిపోతున్నాడు. చాలా తక్కువ గ్యాప్ లోనే థియేటర్స్ కి తన సినిమాలు తీసుకుని వస్తున్నాడు. కానీ అవేవీ ఎక్కువ రోజులు థియేటర్స్ లో నిలబడటం లేదు. ‘ఏక్ మినీ కథ’ తరువాత ఆయన చేసిన ఏ సినిమా కూడా సరిగ్గా ఆడలేదు.
ఈ నేపథ్యంలోనే ‘శ్రీదేవి – శోభన్ బాబు’ అనే టైటిల్ తో ఆయన నిన్న థియేటర్లకు వచ్చాడు. టైటిల్స్ కూడా అందాల నటుడు శోభన్ బాబు .. అతిలోక సుందరి శ్రీదేవి పైనే పడతాయి. దాంతో కథ ఆ కాలంలో నడుస్తుందేమో అనే ఒక ఆసక్తి కలుగుతుంది. కానీ హీరో .. హీరోయిన్స్ కి ఆ పేర్లు పెట్టేసి, చప్పగా వడ్డించారు. కథ .. కథనం .. పాటలు .. కామెడీ .. ఇలా ఏది తీసుకున్నా వాటిలో విషయం లేదు. సంతోష్ మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచాడు. సరైన కథలపై దృష్టిపెట్టడంలో ఇప్పటికే ఆలస్యం చేసిన సంతోష్, వెంటనే మేల్కొనకపోతే కష్టమే.