విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యు శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓ విశాల భావజాలంతో కూడుకున్న వైసీపీ పనితీరును గమనించాలని గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేస్తోన్న సీతంరాజు సుధాకర్ కు మద్దతుగా విశాఖలో వైఎస్సర్సీపీ ఆధ్వర్యంలో ఓ సమావేశం నిర్వహించారు. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, డిప్యూటీ సిఎం పీడిక రాజన్న దొర , మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బూడి ముత్యాల నాయుడు, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ఎన్నికలు, అధికారం, కాలక్షేపం కోసం కాకుండా… సమాజంలో మధ్య ఉన్న అసమానతలు, ప్రాంతాల మధ్య అభివృద్ధి వ్యత్యాసం, కులాలమధ్య ఉన్న ఆవేదనలు తొలగించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్న విషయం గమనించాలని కోరారు.
ఆయారాం, గాయారాం కాకుండా… సమూలంగా సమాజాన్ని ప్రక్షాళన చేయాలన్న లక్ష్యంతోనే పాలన సాగుతోందని, విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు అమలు చేస్తున్నామని, తరతరాలుగా నిర్ణయాధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు రాజకీయ అధికారం ఇస్తున్నామని వివరించారు. ఈ గొప్ప మార్పులను గమనించాలని, మాయమాటలు చెప్పే రాజకీయ నాయకుల ఉచ్చులో పడవద్దని హితవు పలికారు. గ్రాడ్యుయేట్స్ అందరూ ఎన్నికల్లో పాల్గొని తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.