Sunday, November 24, 2024
HomeTrending Newsగజల్‌ రచయిత్రి భైరి ఇందిర కన్నుమూత

గజల్‌ రచయిత్రి భైరి ఇందిర కన్నుమూత

ప్రముఖ గజల్‌ రచయిత్రి ఇందిర భైరి ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. తెలంగాణ గజల్‌ దిగ్గజం స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…వందల సంఖ్యలో గజల్స్​‍ రాసిన ఇందిరా భైరి, భర్త ఉద్యోగరీత్య హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తెలంగాణ గజల్‌ కావ్యం, సవ్వడి, గజల్‌ భారతం మన కవులు వంటి గజల్స్​‍ సంకలనాలు ఆమెకు విశేష పేరును తీసుకొచ్చాయి. రావి రంగారావు సాహిత్య కళాపీఠం నుంచి ‘జన రంజక కవి పురస్కారం’ అందుకున్నారు.
మహిళా గజల్స్​‍ రచయితల్లో తొలిసారిగా గజల్స్​‍ సంకాలను విడుదల చేసి చరిత్ర సృష్టించారు. హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తూనే తీరిక సమయాల్లో వందల సంఖ్యలో గజల్స్​‍ రాసిన ఇందిర భైరి.. ప్రముఖ గజల్స్​‍ కళాకారిణి హిమజా రామమ్‌ ఆమెకు కూతురు. తెలంగాణ గజల్స్​‍ సాహిత్యానికి విశేష కృషి చేసిన తల్లీబిడ్డలు… బతుకమ్మ, తెలంగాణ అమరవీరులు, ఉద్యమ నేపథ్యం, సాయుధపోరాటం, మన పండుగలపై అనేక గజల్స్​‍ రాశారు. నిజాంపేటలో ఇందిరభైరి అంత్యక్రియలు జరుగనున్నాయి.

*తన చావు గురించి తాను రాసుకున్న కవిత్వం.*
నిజంగా చాలా బాధాకరం
(తెలుగు టీచర్, కవయిత్రి బైరి ఇందిర గారు ముందే రాసుకున్న కవిత్వం.)
నేను పోయినప్పుడు
ఓ కాగితాన్ని కప్పండి
రాసుకోడానికి పనికొస్తుంది
మట్టిలో కప్పెట్టకండి
మరీ గాలాడదు
పురుగూ పుట్రా ఉంటాయ్
పెన్సిలు, రబ్బరు, కర్చీఫ్
బ్యాగులో ఉండేలా చూడండి
సెల్ మర్చిపొయ్యేరు
బోర్ కొట్టి చస్తాను
దండలు గిండలు వెయ్యకండి
నాకు ఎలర్జీ
పసుపు గట్రా పూసి
భయంకరంగా మార్చకండి
పిల్లలు ఝడుసుకుంటారు
పైగా నన్ను గుర్తుపట్టాలి కదా
పుణ్యస్త్రీ, పాపపు స్త్రీ అని
పేర్లు పెట్టకండి
నాకు చిర్రెత్తుకొస్తుంది
నా సామాన్లన్నీ పడేయకండి
అడిగినవాళ్లకు ఇచ్చేయండి
మంగళవారమైనాసరే,
పాడెకు కోడిపిల్లను కట్టి హింసించకండి
ఇప్పుడైనా నా మాట నెగ్గనియ్యండి
డ్యాన్సులాడి లేట్ చెయ్యకండి
ఏదైనా టైం ప్రకారం జరగాలి
కాస్త చూసి తగలబెట్టండి
పక్కన మొక్కలుంటాయేమో
బడికి ఇన్ఫామ్ చెయ్యండి
వాళ్లు సెలవిచ్చుకుంటారు
దేనికీ ఇబ్బంది పడకండి
గొల్లవాళ్ల కొట్లో ఖాతా ఉంది
పిట్టకు పెట్టేదున్నా లేకున్నా
అన్ని రోజులూ అందరు
ఇక్కడే ఉండండి
మళ్లీ మళ్లీ చస్తానా ఏంటి
పనిలో పని
కాష్టం దగ్గర
కవిసమ్మేళనం పెట్టండి
నేనూ ఉ(వి)న్నట్టుంటుంది
RELATED ARTICLES

Most Popular

న్యూస్