ఆంధ్ర ప్రదేశ్ తనకు రెండో ఇల్లు లాంటిదని, రిటైర్మెంట్ తరువాత ఇక్కడే ఉండాలని ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభివర్ణించారు. మూడేళ్ళ ఏడు నెలలపాటు ఇక్కడ పనిచేశానని, ఇన్నేళ్ళు ఇక్కడి ప్రజలు తనపై చూపిన ఆప్యాయత, ప్రేమ అమూల్యమైనదని, బదిలీపై వెళ్తుండడం తనకు బాధగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో బిశ్వభూషణ్ భావోద్వేగంతో ప్రసంగించారు. తన చివరి శ్వాస వరకూ ఈ ప్రాంతాన్ని మర్చి పోలేనని, సిఎం జగన్ ఇన్నేళ్ళుగా తనపై చూపించిన ఆదరణ ఎప్పటికీ మరువలేనన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నారని కితాబిచ్చారు. ఇన్ని పథకాలకు నిధులు ఎలా అని తాను అడిగినప్పుడు దేవుడి ఆశీర్వాదంతో అంటూ జగన్ చెప్పారని గవర్నర్ చమత్కారించారు. రైతు భరోసా కేంద్రాలను తాను స్వయంగా పరిశీలించానని, రైతులతో మాట్లాడానని, వారికి అన్నివిధాలా తోడ్పాటు అందించేనుకు ఆర్బీకేలు ఉపయోగపడుతున్నాయని, వీటిపై తాను ప్రధాని మోడీకి కూడా చెప్పాలని వెల్లడించారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయమని, ఈ విషయంలో ప్రజలు కూడా ఎంతో సహకరించారని, డాక్టర్లు అందించిన సేవలు నిరుపమానమని పేర్కొన్నారు.
Also Read : తండ్రిలా..పెద్దలా…: గవర్నర్ పై సిఎం ప్రశంస