దేశాన్ని వీడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. విదేశాల్లో స్థిరపడేందుకు ఎక్కువ మంది భారతీయులు మొగ్గు చూపుతున్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్‌ఈ దక్షిణాసియా దాదాపు 20,000 మందిని సర్వే చేయగా, వచ్చే రెండేండ్లలో వేరే దేశానికి వెళ్లిపోదామనుకొనేవాళ్లు 17 శాతం మంది ఉన్నట్టు తేలింది. సర్వేలోని విశేషాలను ‘వాయిస్ ఫ్రమ్ ఇండియా: హౌ విల్ పీపుల్ లివ్, వర్క్ అండ్ షాప్ ఇన్ ది ఫ్యూచర్’ పేరుతో నివేదికను ఈ సంస్థ విడుదల చేసింది. నివేదిక ప్రకారం.. గత రెండేండ్లలో 16 శాతం మంది వేరే దేశానికి వెళ్లి సెటిల్ అయ్యారు. అలాగే, కొత్త ఇంట్లోకి వెళ్లే వారు కూడా పెరుగుతున్నారు. అందుకోసం 44 శాతం మంది 20-26 ఏండ్ల వయస్కులు (జనరేషన్ జెడ్) ప్లాన్ చేసుకొంటున్నారు. పాలసీల్లో పెను మార్పులు, స్టాంప్ డ్యూటీ ఎత్తివేత, తక్కువ గృహరుణాల వడ్డీ రేట్లు, డెవలపర్లు ఇస్తున్న డిస్కౌంట్లు, స్కీంల వల్ల భారత రెసిడెన్షియల్ రంగం భారీ వృద్ధి సాధిస్తున్నది. ఇది ఇల్లు కొనాలనుకొనేవారిని ఆకర్షిస్తున్నదని, కరోనా తర్వాత పరిణామాలు కూడా కొత్తిల్లు కొనేలా చేస్తున్నదని సర్వే వెల్లడించింది.
- ఆసియా పసిఫిక్ దేశాల్లోకెళ్లా వేరే దేశానికి వెళ్లాలనుకొనేవాళ్లు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారు.
- 43-58 ఏండ్ల వారు (జనరేషన్ ఎక్స్) మినహా అన్ని జనరేషన్ల వ్యక్తులు నగరానికి మధ్యలో ఉండే ఇంటికోసం వెతుకుతున్నారు.
- అందులోనూ 70% మంది కొత్త ఇల్లు కావాలని చూస్తున్నారు.
- జనరేషన్ ఎక్స్ వ్యక్తులు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. వీలైతే వేరే దేశానికి వెళ్లాలన్న కుతూహలంతో ఉన్నారు.
- కొత్త ఇంట్లో ఇంటీరియర్ డిజైన్లు, అవుట్ డోర్ ఏరియా, చుట్టూ ప్రాంతం బాగుండేలా చూస్తున్నారు.