ఇండియన్ – అమెరికన్ అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అమెరికా తరఫున ప్రతిపాదిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ప్రకటించారు. ఒకవేళ అజయ్ బంగాను అధ్యక్షుడిగా ప్రపంచ బ్యాంకు బోర్డు డైరెక్టెర్లు ఎన్నుకుంటే వరల్డ్ బ్యాంకు మొట్టమొదటి ఇండియన్ – అమెరికన్, సిక్కు – అమెరికన్‌గా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. ఈ కీలక సమయంలో ఈ బాధ్యత చేపట్టడానికి, ప్రపంచ బ్యాంకును నడిపించడానికి అజయ్ అన్ని విధాలుగా సమర్థుడని బైడెన్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు, పెట్టుబడులు కల్పించిన ప్రపంచస్థాయి సంస్థలను నిర్మించడంలో, నడిపించడంలో మూడు దశాబ్దాలుగా అజయ్ బంగా విజయవంతంగా పని చేస్తున్నారని జో బైడెన్ కొనియాడారు.
అజయ్ బంగా మహారాష్ట్రలోని పుణె కంటోన్మెంట్ ప్రాంతంలో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. అహ్మదాబాద్‌లోని ఐఐఎంలో పీజీ చేశారు. మాస్టర్‌కార్డు సహా అనేక అంతర్జాతీయ సంస్థల్లో పని చేశారు. అమెరికాలో స్థిరపడిన అజయ్ బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్‌కు వైస్ చైర్మన్‌గా ఉన్నారు.