Sunday, November 24, 2024
HomeTrending Newsరాయ్‌పూర్ వేదికగా ఏఐసీసీ ప్లీనరీ ప్రారంభం

రాయ్‌పూర్ వేదికగా ఏఐసీసీ ప్లీనరీ ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ఈ రోజు (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ వేదికగా ఈ సమావేశాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. సమావేశాల సందర్భంగా నేడు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశాల్లో మొత్తం 6 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు తీర్మానాలను ఖరారు చేయనున్నారు.

ముఖ్యంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చించి స్టీరింగ్ కమిటీ నిర్ణయించనుంది. అయితే ఈ చర్చకు పార్టీ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పూర్తి స్వేచ్ఛను, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఇచ్చేందుకే వారీ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సమావేశాల్లో భాగంగా 25వ తేదీన (శనివారం) ఉదయం 9:30 గంటలకు ‘పార్టీ జెండా’ వందనం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షోపన్యాసం ఉంటుంది. అదేరోజు మూడు తీర్మానాలను పార్టీ ఆమోదించనుంది. ఇందులో రాజకీయ, ఆర్థిక, విదేశీ విధానానికి సంబంధించి తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించి, ఆమోదించనున్నారు. ఇదే రోజున సోనియా గాంధీ ఉపన్యాసం కూడా ఉండనుంది. ఫిబ్రవరి 26(ఆదివారం) మరో మూడు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. యువత-నిరుద్యోగం, సామాజిక న్యాయం-సాధికారత, వ్యవసాయరంగ సమస్యలు ఏఐసీసీ చర్చించనుంది.

చివరి రోజు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు అధ్యక్షుడు ఖర్గే ఉపన్యాసంతో ప్లీనరీ ముగియనుంది. ముగింపు ఉపన్యాసంలో పార్టీ 5 సూత్రాల కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం ఏఐసీసీ సమావేశాల్లో, ఆ తరువాత 4 గంటలకు జరిగే భారీ బహిరంగ సభను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. దీంతో పాటు 2024 ఎన్నికలు రాబోతున్న తరుణంలో పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలనే దానిపై కూడా ప్లీనరీలో చర్చ జరగనుంది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్