Saturday, September 21, 2024
HomeTrending Newsబిజెపి బెదిరింపులకు భయపడేది లేదు - మంత్రి వేముల

బిజెపి బెదిరింపులకు భయపడేది లేదు – మంత్రి వేముల

దేశంలో మోడీ అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ ఒక్కరే పోరాటం చేస్తున్నారని బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశాన్ని నిలువునా దోచుకు తింటున్న పార్టీ బిజెపి అని విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలోని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు 500 మంది రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో శనివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు.. ఎనిమిదేళ్ళ బిజెపి మోది పాలనలో ఎవరికి లాభం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. పైగా కేసిఆర్ ప్రభుత్వం చేసే మంచి పనులపై బిజెపి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు పల్లెలకు వస్తున్నాయి, కేసిఆర్ తెలంగాణ ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు వస్తున్నాయో గమనించాలన్నారు. రాష్ట్రం నుండి కేంద్రానికి 3లక్షల 70 వేల కోట్ల పన్నుల రూపంలో కడితే కేంద్రం ఇచ్చింది కేవలం 1లక్ష 70 వేల కోట్లు మాత్రమే అని,మిగితా సొమ్మంతా బిజెపి పాలిత రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. మోది ప్రధాని అయిన తర్వాత డాలర్ తో రూపాయి విలువ ఎన్నడూ లేనివిధంగా క్షీణించిందన్నారు. మోడీ కంటే ముందు ఉన్న 13మంది ప్రధానులు 55లక్షల కోట్ల అప్పు చేస్తే మోడీ ఒక్కడే 8ఏళ్లలో 100లక్షల కోట్ల అప్పు చేశాడన్నరు.

సామాన్య ప్రజలు చిన్న లోన్ తీసుకుంటే బ్యాంకులు ముక్కు పిండి వసూలు చేస్తాయి కానీ మోడీ తన కార్పొరేట్ మిత్రులు తీసుకున్న 12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని అన్నారు. ఎవడబ్బ సొమ్మని తమ కార్పొరేట్ మిత్రులకు మేలు చేసి దేశ ప్రజల మీద భారం వేశారని నిలదీశారు. అప్పనంగా వచ్చిన 12 లక్షల కోట్లను బిజెపి అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ఖర్చు చేస్తున్నారన్నారు. అట్లా ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూలదోశారని మండిపడ్డారు. వేల కోట్ల ఎల్ఐసి ప్రీమియం డబ్బులను కూడా పక్కదోవ పట్టించిన ఘనత మోదిది అని అన్నారు. తన మిత్రుడు అదానీ కేవలం 8 ఏళ్లలో 45 వేల కోట్ల నుండి 11లక్షల కోట్లకు పడగలెత్తిండు ఆ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. హిండేన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ మోడీ దోస్త్ అవినీతిని బయటపెట్టిందని అన్నారు. నిజంగానే ప్రధాని మోది సచ్చీలుడైతే అదానీపై సీబీఐ,ఈడి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ప్రశ్నించిన అందరిపై సీబీఐ నీ ప్రయోగిస్తున్నారని..ఎమ్మెల్సి కవిత జైల్ కు వెళ్తుందని ఒక మామూలు బీజేపీ ఎంపి ఎలా డిసైడ్ చేస్తాడని నిలదీశారు. రుణమాఫీ,5జి స్పెక్ట్రం రెండు కేసుల్లోనే మోడీ,అమిత్ షా దాదాపు 22లక్షల కోట్ల అవినీతి చేశారని, వారి అవినీతిని ప్రశ్నిస్తున్న కేసిఆర్ కుటుంబంపై పడ్డారని, ఆయన కూతురు ఎమ్మెల్సి కవితమ్మను జైల్ కు పంపిస్తామని ఒక సాధారణ బీజేపీ ఎంపి మాట్లాడుతున్నారని అన్నారు. సుప్రీం కోర్టు వీరి ఆగడాలు అన్ని గమనిస్తున్నదని, అవినీతి బిజెపి నేతలకు బేడీలు తప్పవని హెచ్చరించారు.

ఎంపి అరవింద్ నోరు విప్పితే అబద్ధాలు, బూతులు మాట్లాడుతరు తప్పా ఆయన వల్ల ఒరిగింది ఏమీ లేదన్నారు. ఎంపి అరవింద్ కు దమ్ముంటే గ్రామాల్లో పర్యటించే ముందు ఆ ఊరికి ఏమి ఇచ్చాడో,కేంద్రం నుంచి తెచ్చిన నిధులతో ఏమీ అభివృద్ది చేశాడో చెప్పి ఆ గ్రామంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చి గెలిచి రైతులను మోసం చేసిన అర్వింద్,ఇపుడు మళ్లీ గెలిపిస్తే పసుపు పరిశ్రమ తెస్తానని సిగ్గులేకుండా చెప్తున్నాడని దుయ్యబట్టారు.

Also Read : ఎర్రజొన్న వ్యాపారులకు మంత్రి వేముల వార్నింగ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్