చంద్రబాబును ముసలాయన అంటూ సిఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. యువ గళం పాదయాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న లోకేష్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. సిఎం జగన్ కొబ్బరికాయ కొట్టడానికి కూడా కిందకు వంగలేక పోతున్నారని, రాయి పైకి ఎత్తమని అయ్యగారిని అడిగారని… ఇటీవల కడప స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. కానీ చంద్రబాబును వెయ్యిమంది పోలీసులు ఆపినా వారిని దాటుకుంటూ ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ కుర్రాడిలా అనపర్తి సభకు వెళ్ళారని… ఎవరు ముసలోడు, ఎవరు కుర్రాడు అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. చంద్రబాబు రాయలసీమకు అనేక పరిశ్రమలు తీసుకు వస్తే, సిఎం జగన్ ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు.
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కూడా లోకేష్ విమర్శలు చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పూ తీసుకు రాలేకపోయారని, కానీ పండుగకు ఒక స్వీట్ బాక్స్, చీర ఇస్తుంటారని వ్యాఖ్యానించారు. చెవిరెడ్డి తన అనుచరులను అడ్డుపెట్టుకొని అక్రమంగా ఎర్రచందనం స్వాహా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎర్రచందనం మీదనే వంద కోట్ల రూపాయలు సంపాదించారని లోకేష్ ఆరోపించారు.
Also Read : తిరుపతికి ఇద్దరు ఎమ్మెల్యేలు: లోకేష్ ఎద్దేవా