వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ యోజనపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ పథకం ద్వారా 2019 నుంచి ఇప్పటి వరకూ 27,062 కోట్ల రూపాయాల సాయాన్ని అందించామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, అటవీ భూములకు సంబంధించి ఈ సాయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే లభిస్తోందని వెల్లడించారు. పంట నష్టం కింద మూడేళ్ళ తొమ్మిది నెలల కాలంలో ఇప్పటివరకూ 1,912కోట్లు ఇన్ పుట్ సబ్సిడీని ఇప్పటివరకూ అందించామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంటు ఈ రెండూ కలిపి మాత్రమే బడ్జెట్ రూపొందిస్తారని, బడ్జెట్ స్వరూప స్వభావం కూడా తెలియదా అంటూ కొన్ని మీడియా సంస్థలను, విపక్షాలను మంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక పథకాల్లో కేంద్ర భాగస్వామ్యం ఉంటుందని, రాష్ట్ర ఆదాయంలో కేంద్రం వాటా కూడా ఉంటుందని అన్నారు. కొన్ని మీడియా సంస్థలు అర్జంటుగా జగన్ ను దించేసి చంద్రబాబును కుర్చీలో కూర్చోబెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయని, అందుకే ప్రతి విషయంలోనూ తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బాబు హయంలో కరువు మండలాలు ప్రకటించిన విషయం వాస్తవ కాదా అని నిలదీశారు.
2014 ఎన్నికలకు ముందు రైతు రుణాలు భేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పిన మాట వాస్తవం కాదా? ఆ మాఫీలో కోత పెట్టడం కోసం కోటయ్య కమిటీ వేశారని, ఈ విషయం నిజమా కాదా అని రాసే దమ్ము ఉందా అని సవాల్ చేశారు. మీడియానే ప్రశ్నలు వేసుకొని వారే సమాధానాలు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
175స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అంటూ సిఎం జగన్ విసిరిన సవాల్ స్వీకరించే ధైర్యం టిడిపికి ఉందో లేదో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా ఏవేవో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇన్నేళ్ళు సిఎంగా పనిచేసిన చంద్రబాబు ఇప్పటికీ ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయలేకపోతున్నారంటే అయన ఒక విఫలమైన నేత అని అర్ధమన్నారు. తాము సంక్షేమం అందిస్తుంటే పప్పు బెల్లాలు అంటూ మాట్లాడిన బాబు ఇప్పుడేమో తాము వస్తే వీటిని కొనసాగిస్తామని చెబుతున్నారని కాకాణి అన్నారు. తాము మంచి చేశాం కాబట్టే 175 అంటూ ధీమాగా ఉన్నామన్నారు.
లోకేష్ పాదయాత్రకు జనాలు రావడం లేదు కాబట్టి 400 మంది వాలంటీర్లను నియమించుకున్నారని, పైగా రక్షణ కోసం నియమించుకున్నామని చెబుతున్నారని కాకాణి విస్మయం వ్యక్తం చేశారు. రోజుకు 2వేలు ఇచ్చి పెట్టుకున్నా వీళ్ళలో కూడా 300 మంది ఆయనతో కలిసి నడవడం లేదంటే…. సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. చంద్రబాబుకున్న ప్రజాదరణకు లోకేష్ యాత్ర నిదర్శనంగా నిలుస్తుందని మంత్రి వ్యంగ్యంగా అన్నారు.