గ్యాస్ బండ ధరను మరోసారి పెంచిన కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై ప్రత్యేకించి మహిళలపై గుదిబండను మోపిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికే గ్యాస్ ధర పెరిగిందని ఆందోళన చెందుతున్న ప్రజలపై మరోసారి 50 రూపాయలు పెంచడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోకి బిజెపి ప్రభుత్వం వచ్చాక నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. పెట్రో, డీజిల్ ధరలేగాక గ్యాస్ ధరలు కూడా పెరిగాయన్నారు. నిత్యావసరంగా మారి, ప్రతి ఒక్కరూ ఆధారపడుతున్న గ్యాస్ ధరలను పెంచడం అంత మంచిది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్నీ పెంచి, ఒకరిద్దరిని పోషిస్తున్నట్లుగా మంత్రి ఆరోపించారు.
ఇదిలావుండగా, బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు, టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, ఇచ్చిన పిలుపు మేరకు… కేంద్రం పెంచిన నిత్యావసర సరుకులు, ప్రత్యేకించి గ్యాస్ ధర పెంపునకు నిరసనగా 2వ తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో, 3వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో బిఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, మహిళలతో కలిసి ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
Also Read : సిలిండర్ ధర పెంపు…మహిళలకు మోడీ కానుక – కేటిఆర్ విమర్శ