వెస్టిండీస్ తో స్వదేశంలో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా 87 పరుగులతో విజయం సాధించింది. గెలుపు కోసం 247 పరుగులు అవసరం కాగా 159 పరుగులకే విండీస్ చాప చుట్టేసింది.
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 342 పరుగులకు ఆలౌట్ అయ్యింది, వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 212 పరుగులు చేసి 130 పరుగులు వెనకబడింది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో నిన్న రెండో రోజు ఆట ముగిసే సమయానికి 49 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. విండీస్ బౌలర్లు చెలరేగి ప్రోటీస్ ను 116 పరుగులకే కట్టడి చేసి ఆలౌట్ చేశారు. రోచ్ 5; అల్జారీ జోసెఫ్, హోల్డర్ చెరో 2; గాబ్రియేల్ 1 వికెట్ పడగొట్టారు. మొత్తంగా సౌతాఫ్రికా 246 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
లక్ష్యం స్వల్పం, అందునా మరో రెండ్రోజుల ఆట మిగిలి ఉన్నప్పటికీ ఆచి తూచి ఆడడంలో విండీస్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. సౌతాఫ్రికా పేసర్ రబడ దెబ్బకు బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. జట్టులో జెర్మైన్ బ్లాక్ వుడ్ ఒక్కడే 79 రన్స్ తో హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచాడు. ముగ్గురు డకౌట్ కాగా, మరో ముగ్గురు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దీనితో 159 పరుగులకే విండీస్ ఆలౌట్ అయ్యింది. రబడకు 6 వికెట్లు దక్కగా, మార్కో జెన్సన్ 2; నార్త్జ్, కోయిట్జ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఈ టెస్టులో సెంచరీ సాధించిన ఏడెన్ మార్ క్రమ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
రెండో టెస్ట్ జోహెన్స్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో మార్చి 8న మొదలు కానుంది.