గుజరాత్ జెయింట్స్ కు వరుసగా రెండో అపజయం ఎదురైంది. యూపీ వారియర్స్ 3వికెట్ల తేడాతో ఆ జట్టుపై విజయం సాధించింది. వారియర్స్ కు చివరి మూడు ఓవర్లలో 53 పరుగులు అవసరం కాగా, గ్రేస్ హారిస్- ఎక్సెల్ స్టోన్ లు అద్భుతమైన ఎదురుదాడితో…. మరో బంతి మిగిలి ఉండగానే విజయం అందించారు. గుజరాత్ బౌలర్ కిమ్ గ్రాత్ ఐదు వికెట్లతో రాణించినా ఓటమి తప్పలేదు.
డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హర్లీన్ డియోల్-46; ఆష్లీ గార్డ్ నర్-25; సబ్బినేని మేఘన-24; దయాలన్ హేమలత-21 రన్స్ తో రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
యూపీ బౌలర్లలో దీప్తి శర్మ, ఎక్సెల్ స్టోన్ చెరో 2; అంజలి శర్వాణీ, తహీలా మెక్ గ్రాత్ చెరో వికెట్ పడగొట్టారు.
యూపీ 20 పరుగులకే మూడు కీలక వికెట్లు (కెప్టెన్ అలేస్సా హీలీ-7; శ్వేతా షెరావత్-5; తహీలా మెక్ గ్రాత్ డకౌట్) కోల్పోయింది. ఈ దశలో కిరణ్ నవ్ గిరే-53 (43 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) ; గ్రేస్ హారిస్-(26 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్లు ) నాటౌట్; ఎక్సెల్ స్టోన్-22 (12 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) పరుగులతో రాణించి విజయం అందించారు.
గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ 5; సుదర్లాండ్, మనషి జోషి చెరో వికెట్ పడగొట్టారు.
గ్రేస్ హారిస్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.