“అమ్మ లేనిదే జన్మ లేదు… భూమి కన్నా ఎక్కువ భారం మహిళలే మోస్తుంటారు, అలాంటి మహిళా దినోత్సవం ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది… ఈ సమావేశానికి విచ్చేసిన మహిళలందరికీ పాదాభివందనం ” అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేలమీద మోకాళ్ళపై వంగి నమస్కారం చేశారు. యువ గళం పాదయాత్రలో భాగంగా పీలేరు నియోజకవర్గంలోని చింతపర్తి విడిది కేంద్రంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో లోకేష్ తో పాటు టిడిపి మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలను గౌరవించే అంశాన్ని పాఠ్యాంశాల్లో చేరుస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. దిశ చట్టం పేరుతో రాష్ట్ర ప్రజలను సిఎం జగన్ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఆడవారిపై అత్యాచారాలకు పాల్పడితే విచారణ జరిపి 21 రోజుల్లో వారికి ఉరి శిక్ష పడేలా చేస్తానన్న జగన్ ఇప్పటివరకూ ఎంతమందికి ఈ శిక్ష అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి మహిళా దినోత్సవం జరిపే హక్కులేదని స్పష్టం చేశారు.
చిన్నప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉంటే తల్లి నారా భువనేశ్వరి తనను విద్యాబుద్ధులతో తీర్చి దిద్దారని, అలాంటి తన తల్లిని వైసీపీ నేతలు శాసన సభ సాక్షిగా అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన నుంచి తన తల్లి కోలుకోవడానికి నెలరోజుల సమయం పట్టిందని, ఏనాడూ కన్నీరు పెట్టని తండ్రి చంద్రబాబు ఈ ఘటనకు కన్నీరు పెట్టారని లోకేష్ భావోద్వేగంతో చెప్పారు.